అవంటే అయిష్టం
ప్లాస్టిక్ నవ్వులు, పైపై మెరుగులంటే అనుష్కా శర్మకు అయిష్టం.
మనస్ఫూర్తిగా మాట్లాడటం..
మనసులో అనిపించింది ఓపెన్‌గా చెప్పేయడం ఇష్టం.
ఇంకా ఈ బ్యూటీకి బోల్డన్ని ‘ఇష్టాయిష్టాలు’ ఉన్నాయి.
అవేంటో సరదాగా తెలుసుకుందాం...
ఇష్టాలు
♦ పుస్తకాలంటే ప్రాణం. ఫ్రెండ్స్ సరదాగా ‘పుస్తకాల పురుగు’ అని పిలుస్తుంటారు. ఆ పుస్తకం ఈ పుస్తకం అని కాదు.. చేతికి దొరికిందల్లా చదివేస్తారు. షూటింగ్‌లో షాట్ గ్యాప్‌లో ఏదో ఒక బుక్ చదువుతుంటారు.
♦ రొయ్యలు, చేపలు ఎలా వండినా ఇష్టపడేవారు. చికెన్ కర్రీ విత్ బటర్ అంటే చాలా ప్రీతి. కానీ, కొన్ని నెలల క్రితం మాంసాహారం మానేశారు. ఇప్పుడు కూరగాయలను ఇష్టపడుతున్నారు.
♦ నలుపు రంగంటే చాలా ఇష్టం. వార్డ్ రోబ్‌లో ఆ రంగు డ్రెస్‌లే ఎక్కువ.
♦ సినిమాల్లో పాటలకు డ్యాన్స్ చేయడం కామన్. కానీ, విడిగా కూడా ఖాళీ దొరికినప్పుడల్లా డ్యాన్స్ చేస్తుంటారు. ఎందుకంటే డ్యాన్స్ అంటే అనుష్కకు చాలా ఇష్టం.
♦ ఒక్కరోజు యోగా చేయకపోయినా ఏదో వెలితిగా ఉన్నట్లు ఫీలైపోతారు. యోగా అంటే బోల్డంత లైకింగ్ మరి.
♦ ముక్కుసూటిగా వ్యవహరించడం ఇష్టం.
♦ ఇంటి నుంచి బయటికెళ్లేటప్పుడు హ్యాండ్ బ్యాగ్‌లో ఏది ఉన్నా లేకపోయినా ‘ప్రోటీన్ బార్స్’ ఉండేలా చూసుకుంటారు. ఆరోగ్యానికి మేలు చేస్తాయి కాబట్టి, అవంటే చాలా ఇష్టం.
♦ అందమైన జుత్తంటే అనుష్కకు ఇష్టం. హెయిర్ కేర్ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు. షాంపూలు, కండిషనర్లు, హెయిర్ మాస్కులు కొంటుంటారు. షూలంటే బోల్డంత ఇష్టం. లెక్కలేనన్ని ఉన్నాయి.
♦ జపనీస్, ఇటాలియన్ వంటకాలంటే వల్లమాలిన ఇష్టం. ఎంత తిన్నా బరువు పెరగరు. అది తన అదృష్టం అంటారు అనుష్క.
♦ స్వేచ్ఛగా బతకాలనుకుంటారు. తనకు నచ్చినట్లుగా ఇల్లు కొనుక్కున్నారు. అభిరుచికి తగ్గట్టుగా ఆ ఇంటిని డిజైన్ చేయించుకున్నారు. ఆ ఇంట్లో ఒంటరిగా ఉండటం ఇష్టం.
అయిష్టాలు
♦ స్మోకింగ్ అంటే అనుష్కా శర్మకు పరమ అసహ్యం. ఎవరైనా సిగరెట్ తాగుతూ కనిపిస్తే చెడామడా తిట్టాలనిపిస్తుందట.
♦ డబ్బుకి ప్రాధాన్యం ఇచ్చేవాళ్లంటే ఇష్టం ఉండదు. స్టేటస్ చూసి ఫ్రెండ్‌షిప్ చేసేవాళ్లను ఆమడ దూరంగా ఉంచేస్తారు.
♦ బిజీ బిజీగా షూటింగ్స్ చేయడం నచ్చదు. షూటింగ్ లొకేషన్లో ఎవరైనా అనవసరంగా హైరానా పడుతుంటే ‘కూల్ బాసూ’ అంటారు.
♦ గాసిప్పురాయుళ్లంటే అస్సలు ఇష్టం ఉండదు. విరాట్ గురించి, తన గురించి వార్తలు ప్రచారం చేసేవాళ్లు కంటికి కనిపిస్తే రఫ్ఫాడేయాలనేంత కోపం.
♦ అనుష్కా శర్మ అతిగా అసహ్యించుకునేవాటిలో ‘నైట్ షూటింగ్’ ఒకటి. నైట్ షూట్స్ చేసినప్పుడు చాలా డిస్ట్రబ్ అయిపోతారు.
♦ ‘మీ పెళ్లెప్పుడు’ అని ఎవరైనా అడిగితే, చెంప చెళ్లుమనిపించేంత కోపం వస్తుంది. విలేకరుల నుంచి ఆ ప్రశ్న వినకూడదనుకుంటారు.
♦ నర్మగర్భంగా వ్యవహరించేవాళ్లంటే ఇష్టం ఉండదు. అలాంటివాళ్లను వీలైనంత దూరంగా ఉంచుతారు.
♦ చాక్లెట్స్, కాఫీ, నెయిల్ ఆర్ట్ (గోరు మీద వేసే డిజైన్) వంటివాటిని ఇష్టపడరు.
♦ ఆడవాళ్లు అబలలు అనే మాట వినడానికి ఇష్టపడరు. అలా ఎవరైనా అంటే, వాళ్లకి ఓ రేంజ్‌లో క్లాస్ తీసుకుంటారు.
♦ ప్లాస్టిక్ నవ్వులు నవ్వడం చేతకాదు. అలా నవ్వేవాళ్లంటే అయిష్టం.