
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదట!
హండ్రెడ్ పర్సంట్ అందంగా ఎవరూ ఉండరు. ఏదో చిన్న లోపం అయినా ఉంటుంది. అలాంటి లోపాలను సరిచేయడానికి ప్లాస్టిక్ సర్జరీ ఉంటుంది. అనుష్కా శర్మ తన పెదాలకు అదే చేయించారనే టాక్ విస్తృతంగా ప్రచారమవుతోంది. ఆ మధ్య ‘బాంబే వెల్వెట్’ సినిమా కోసం ఆమె తన లిప్స్‌కు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని చెప్పుకుంటున్నారు. తీరా అది వికటించడంతో ఆమె పెదాలు మునుపటికన్నా అందవిహీనంగా తయారయ్యాయని మాట్లాడుకుంటున్నారు. కొన్నాళ్లుగా ఈ వార్తలకు స్పందించని అనుష్క సడన్‌గా ఓ కార్యక్రమంలో ఈ ప్రశ్న అడిగేసరికి అగ్గి మీద గుగ్గిలమయ్యారు.
‘‘నా పెదవులకు కత్తెర పడాల్సిన పని లేదు. ‘బాంబే వెల్వెట్’ సినిమా కోసం ఓ స్పెషల్ టూల్ సాయంతో నా పెదవులకు మేకప్ వేశారంతే. అంతకు మించి ఎటువంటి సర్జరీ జరగలేదు. ఇలాంటి విషయాలు మళ్లీ నా దగ్గర ఎత్తకండి’’ అని కాస్త ఘాటుగానే స్పందించారు అనుష్క. అందాల తార ఇలా విరుచుకుపడటంతో అడిగినవాళ్లు సెలైంట్ అయిపోయారట.