వడ్డించేవాడు మనవాడయితే బంతిలో ఎక్కడ కూర్చున్నా పర్వాలేదని తెలుగులో ఓ సామెత! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల జాబితా విషయంలో కొందరు ఈ సామెతనే గుర్తు చేసుకుంటున్నారు. ‘అవార్డులు ఇచ్చేవాడు మనవాడయితే ఎలాంటి సినిమా తీసినా పర్వాలేదేమో!’ అంటున్నారు కొందరు నెటిజన్లు. సోమవారం ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలో కొందరు బాహాటంగానే విమర్శించారు.
‘రుద్రమదేవి’ తీసినందుకు క్షమించండి: గుణశేఖర్
‘మా సిన్మాకి పన్ను మినహాయింపు ఎందుకివ్వలేదని ప్రశ్నించడమే నేను చేసిన తప్పా?’ అనడుగుతున్నారు ‘రుద్రమదేవి’ దర్శక–నిర్మాత గుణశేఖర్. ‘‘మహిళా సాధికారతను చాటి చెబుతూ తీసిన ‘రుద్రమదేవి’ మూడు ఉత్తమ చిత్రాల్లో ఏదో ఒకదానికి ఎందుకు ఎంపిక కాలేకపోయింది? కనీసం జ్యూరీ గుర్తింపుకి కూడా నోచుకోలేకపోయింది. మరచి పోయిన తెలుగు జాతి చరిత్రని వీడెవడో వెతికి, సినిమా తీసి గుర్తు చేశాడు. మళ్లీ ఇప్పుడు అవార్డులు ఇచ్చి గుర్తు చేయడం ఎందుకు అనుకున్నారా? ఇలాంటి చిత్రాన్ని ప్రోత్సహిస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళతాయని భావించారా? అదే అయితే... ‘రుద్రమదేవి’ లాంటి చిత్రాన్ని నిర్మించినందుకు నన్ను క్షమించండి’’ అని గుణశేఖర్ పేర్కొన్నారు.
మెగా హీరోలందరూ నటన నేర్చుకోవాలి: ‘బన్నీ’ వాసు
మెగా ఫ్యామిలీ సన్నిహితుడు, గీతా ఆర్ట్స్‌లో పలు చిత్రాలకు సహనిర్మాతగా వ్యవహరించిన ‘బన్నీ’ వాసు నంది అవార్డులు ప్రకటన వచ్చిన తర్వాత ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు సాధించడానికి, మెగా హీరోలందరూ టీడీపీ ప్రభుత్వం దగ్గర నటనలో మెళకువలు నేర్చుకోవాలి’ అని ఫేస్‌బుక్‌లో కామెంట్ చేశారు. అనంతరం ‘‘ఏదో సినిమాకు అవార్డు వచ్చిందనో? మాకు రాలేదనో? కామెంట్ చేయలేదు. 2014లో ‘రేసుగుర్రం’ ఎంత ప్రజాదరణ పొందిందో... అందరికీ తెలిసిందే. ఉత్తమ చిత్రంతో పాటు చాలా కేటగిరీలు ఉన్నాయి. ‘రేసుగుర్రం’ను దేనికీ కన్సిడర్ చేయకపోవడంతో అప్‌సెట్ అయ్యా. 2012లో ‘గబ్బర్‌సింగ్’ విషయంలోనూ ఇలాంటి అన్యాయమే చేశారు. ఒకవేళ... ఈ రెండూ కమర్షియల్ సినిమాలని పక్కన పెడితే, ఇప్పుడు అవార్డులకు ఎంపిక చేసినవాటిలో 75 శాతం కమర్షియల్ సినిమాలే ఉన్నాయి కదా? వాటికి ఏ ప్రాతిపదికన ఇచ్చారు? మా రెండు సినిమాలను ఎందుకు పక్కన పెట్టారు? తెలియడం లేదు’’ అని ‘బన్నీ’ వాసు పేర్కొన్నారు.
మారుతి కామెడీ
దర్శకుడు మారుతి మంగళవారం ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో నటుడు ఉత్తేజ్ ‘ఉత్తమ అత్త, మేనత్త, అమ్మ, అక్క, చెల్లి, అత్యుత్తమ చెల్లి’ అవార్డులను ప్రకటిస్తుంటారు. ఉత్తమ సవతుల్లో అయితే వన్, టు, త్రీ అవార్డులు ఉంటాయి. ఇదంతా చూస్తున్న వ్యక్తి (నటుడు– రచయిత హర్షవర్ధన్) ‘ఒరేయ్! ఈ అవార్డ్స్ మన కోసం ఎరేంజ్ చేసినవేనా!’ అనడిగితే? పక్కన ఉన్న వ్యక్తి (నటుడు గుండు హనుమంతురావు) ‘ఇండస్ట్రీలో బాలాజీకి ఉన్న పరిచయస్తులకు ఏర్పాటు చేసినవి’ అంటాడు. ఈ వీడియో ఓ సీరియల్‌కి సంబంధించినది. నంది అవార్డులను ఉద్దేశించే సెటైరికల్‌గా మారుతి పోస్ట్ చేశారని పలువురి నెటిజన్ల ఫీలింగ్!
లెజెండ్‌కు ఎక్కువ అవార్డులు రావడం ఆనందాన్నిచ్చింది : బాలకృష్ణ
‘లెజెండ్’ సినిమాకు ఎక్కువ అవార్డులు రావడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. బుధవారం అమరావతి అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2014, 2015, 2016 సంవత్సరాలకు అవార్డులు గెలుచుకున్నవారికి అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్, రఘుపతి వెంకయ్య, బీఎన్‌రెడ్డి, నాగిరెడ్డి–చక్రపాణి అవార్డుల ఎంపికకు మంచి స్పందన వచ్చిందన్నారు.
నంది అవార్డులు... విమర్శలు–వివాదాలు!
Published Thu, Nov 16 2017 1:53 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment