అప్పూ కోరిక ఏంటంటే...!
‘‘చిన్న చిత్రాల నిర్మాణం అంత సులువు కాదు. ఇక, బాలల చిత్రాలంటే మరీనూ. అయినప్పటికీ ఓ మంచి చిత్రం ఇవ్వాలనే ఆకాంక్షతో ‘అప్పూ’ మొదలుపెట్టాను. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఈ చిత్రాన్ని పూర్తి చేశాను’’ అని కె. మోహన్ అన్నారు. స్వీయదర్శకత్వంలో ఆయన రూపొందించిన ‘అప్పూ’ షూటింగ్ ఇటీవల పూర్తయ్యింది. టైటిల్ రోల్‌లో మాస్టర్ సాయి శ్రీవంత్ నటించగా, జాకీ, లోహిత్‌కుమార్, ప్రగ్య, బిందు, జేవీఆర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. చిత్రవిశేషాలను దర్శక-నిర్మాత మోహన్ తెలియజేస్తూ - ‘‘ఉద్యోగాలతో బిజీగా ఉండే తల్లితండ్రులు తన కోసం సమయం కేటాయించాలనీ, ఏనుగును చూడాలనే కోరికను తీర్చాలనీ అప్పూ అనుకుంటాడు.
ఈ చిన్నారి చిన్ని కోరికను తీర్చే తీరిక తల్లితండ్రులకు ఉండదు. ఏనుగును చూడాలని తన స్నేహితులతో కలిసి అడవికి వెళ్లిన అప్పూ ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటాడు? అనేది చిత్రకథ. కె.రాఘవేంద్రరావుగారితో పాటు పలువురి దర్శకుల దగ్గర దర్శకత్వ శాఖలో చేసిన అనుభవంతో తొలి ప్రయత్నంగా నేను రూపొందించిన చిత్రం ఇది. కమర్షియల్ హంగులతో సాగే ఈ చిత్రానికి స్వర్గీయ శ్రీ ఇచ్చిన బాణీల్లో పాటలు హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు. బండ జ్యోతి, కావ్య, బాల తారలు సాయి అభి షేక్, లాస్య, మేఘన, జాషువా, మనోజ్ఞ, ఆదా, చిరుహాస్, సద్దాం నటించారు.