సిమ్రాన్‌కి జరిగిందే మణికర్ణికకూ జరిగింది | Apurva Asrani React to Krish's Comments on Kangana | Sakshi
Sakshi News home page

సిమ్రాన్‌కి జరిగిందే మణికర్ణికకూ జరిగింది

Published Tue, Jan 29 2019 3:45 AM | Last Updated on Wed, Aug 21 2019 10:25 AM

Apurva Asrani React to Krish's Comments on Kangana - Sakshi

అపూర్వ అశ్రాని, క్రిష్‌

‘‘దర్శకుడు క్రిష్‌ ‘మణికర్ణిక’ను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోవడంతో దర్శకత్వ బాధ్యతలను చేపట్టాల్సి వచ్చింది’’ అని ఆ చిత్రం రిలీజ్‌ ముందు కంగనా రనౌత్‌ పేర్కొన్నారు. అయితే ఇటీవల బాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘మణికర్ణిక’ సినిమాకు సంబంధించిన పలు విషయాలు పేర్కొన్నారు క్రిష్‌. ‘‘మణికర్ణిక’ సినిమాను జూన్‌లోనే పూర్తి చేశాను. అన్ని పాత్రలు డబ్బింగ్‌ కూడా చెప్పేసుకున్నారు. అప్పుడు ‘మెంటల్‌ హై క్యా’ షూటింగ్‌ నిమిత్తం లండన్‌లో ఉన్నారు కంగనా. ఇండియా వచ్చిన తర్వాత నేను చిత్రీకరించిన విధానం నచ్చలేదని నిర్మాణ సంస్థను నమ్మించారు.

భోజ్‌పూరి సినిమాలా ఉందని వాళ్లతో పేర్కొన్నారు. సినిమా మొత్తం తన చుట్టూనే తిరగాలన్నట్టు కంగనా ప్రవర్తన ఉండేది. సోనూసూద్‌ పాత్ర సుమారు 100 నిమిషాలు ఉండేది. దాన్ని 60 నిమిషాలకు కుదించేయడంతో ఆయన తప్పుకున్నారు తప్పితే లేడీ డైరెక్టర్‌తో యాక్ట్‌ చేయను అనే కారణం కాదు. ఫస్ట్‌ హాఫ్‌లో ఓ 25 శాతం సెకండ్‌ హాఫ్‌లో 15 శాతం మాత్రమే కంగనా రనౌత్‌ డైరెక్ట్‌ చేశారు’’ అంటూ తెర వెనుక జరిగిన అసలు విషయాన్ని పంచుకున్నారు. క్రిష్‌ పేర్కొన్న విషయాలకు బాలీవుడ్‌ దర్శకుడు, స్క్రీన్‌ రైటర్‌ అపూర్వ అశ్రాని మద్దతు తెలిపారు. ‘‘నేను ‘సిమ్రాన్‌’ అనే సినిమాను ఎంతో ప్రేమతో రాశాను.

అయితే కంగనా రనౌత్‌ మాత్రం మిగతా పాత్రల డైలాగ్స్, సీన్స్‌ను తగ్గించేశారు. ‘మణికర్ణిక’కు ఏం జరిగిందని క్రిష్‌ చెబుతున్నారో ‘సిమ్రాన్‌’ విషయంలోనూ అలానే జరిగింది. స్క్రిప్ట్‌ చాలా బావుందని చెప్పి, తర్వాత తన ఇష్టమొచ్చినట్టు మార్చేసిందామె. క్రిష్‌ ధైర్యానికి, నిజాయితీకి సెల్యూట్‌ చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు అపూర్వ. కంగనా రనౌత్‌ పై క్రిష్‌ చేస్తున్న ఆరోపణలకు కంగనా చెల్లెలు రంగోలి స్పందించారు.  ‘‘క్రిష్‌గారు.. సినిమా మొత్తం మీరే డైరెక్ట్‌ చేశారు. కొంచెం కామ్‌గా ఉండండి. సినిమాకు హీరోయిన్‌ కంగనే కదా. ప్రస్తుతం తన సక్సెస్‌ను ఎంజాయ్‌ చేయనివ్వండి’’ అని పేర్కొన్నారు. ఈ కామెంట్స్‌ గురించి కంగనా ఎలా స్పందిస్తారో చూడాలి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement