
99 సాంగ్స్‌కు నిర్మాతగా ఏఆర్ రెహ్మాన్
సంగీతానికి మరో పేరు ఏఆర్.రెహ్మాన్ అన్నంతగా ఆ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించారాయన. చిన్న చిన్న ఆశ అంటూ రోజా చిత్రంతో కోలీవుడ్‌లో పరిమళించిన ఏఆర్ రెహ్మాన్ ఆ తరువాత తన కేరీర్ పరంగా వెనుదిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడలేదు. తమిళ చిత్ర పరిశ్రమలో ప్రారంభించిన తన సంగీత పయనాన్ని దక్షిణాది, ఉత్తరాది సినీ పరిశ్రమను దాటి హాలీవుడ్‌లో గ్రాండ్‌గా ల్యాండ్ అయ్యింది. స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రంతో పాటలకు ఉత్తమ బాణీలు, నేపథ్య సంగీతం అంటూ రెండు ఆస్కార్ అవార్డులను ఒకే వేదికపై అందుకున్న ఘన చరిత్ర ఏఆర్ రె హ్మాన్‌ది.
ఆ విధంగా భారతీయ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన ఈ సంగీత మాంత్రికుడు గ్రామీ అవార్డులతో పాటు పలు అంతర్జాతీయ అవార్డులను అవలీలగా కొల్లగొట్టారు. సంప్రదాయ సంగీతంలో పాశ్చాత్య సంగీతాన్ని మేళవించి కొత్త పుంతలు తొక్కించిన ఏఆర్.రెహ్మాన్ బహుముఖ ప్రజ్ఞావంతుడని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయనలో సంగీత దర్శకుడే కాకుండా మంచి గాయకుడు, గీత రచయిత, కథకుడు ఉన్నారన్నది తెలిసిందే. కాగా తాజాగా మంచి నిర్మాత కానున్నారు.
ఈ బాధ్యతలు చేపట్టాలన్న ఆసక్తిని ఆయన చాలా కాలంగా వ్యక్తం చేస్తున్నారు. అది త్వరలో కార్యరూపం దాల్చనుందన్నది తాజా సమాచారం. ఏఆర్.రెహ్మాన్ 99 పాడల్‌గళ్(99 సాంగ్స్) అనే పేరుతో ఒక చిత్రం నిర్మించనున్నారు. హిమాన్ భట్, డెన్సింగ్ డలా అనే నూతన జంట హీరోహీరోయిన్లుగా నటించనున్న ఈ చిత్రానికి విశ్వేశ్ కృష్ణమూర్తి దర్శకత్వ బాధ్యతల్ని నిర్వహించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.