ఇరవైఅయిదు కథలు విన్నా...ఇదొక్కటే నచ్చింది : అర్జున్
‘‘నటుడిగా నా కెరీర్ మొదలై 30ఏళ్లు పైనే అయింది. ప్రతి సినిమాని ఓ పాఠంలానే భావిస్తాను. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎన్నో మంచి పాత్రలు చేశాను. ఇప్పుడు ఒప్పుకున్న ఈ సినిమాలో కూడా నాది మంచి పాత్ర. ఈ మధ్య కాలంలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 25 కథలు విన్నాను. ఈ కథ మాత్రమే నన్ను ఎగై్జట్ చేసింది. తెలివి, లౌక్యం.. ఇలా అన్నీ ఉన్న పాత్ర కావడంతో నటుడిగా నాకు మంచి స్కోప్ ఉంది’’ అని యాక్షన్ కింగ్ అర్జున్ అన్నారు. కొంత గ్యాప్ తర్వాత ఆయన తెలుగులో ఓ సినిమాలో స్పెషల్ రోల్ చేయడానికి అంగీకరించారు. హను రాఘవపూడి దర్శకత్వంలో నితిన్ హీరోగా వెంకట్ బోయినపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మాతలు.
సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అనీల్ సుంకర మాట్లాడుతూ – ‘‘స్పెషల్ రోల్‌కి అర్జున్‌గారైతే బాగుంటుందనిపించింది. ఆయన అంగీకరించినందుకు ఆనందంగా ఉంది. ఇలాంటి పాత్రలు ఆయనకు కొత్త కాదు. కాకపోతే ఆయన కెరీర్‌లో మరో మంచి క్యారెక్టర్ అవుతుంది’’ అన్నారు. ‘‘అర్జున్‌గారు ఈ సినిమా అంగీకరించినప్పుడు.. సచిన్ టెండూల్కర్ వరల్డ్ కప్ గెలిచిన సమయంలో ఎంత ఆనందపడ్డారో నేనూ అంతే ఆనందపడ్డా’’ అని దర్శకుడు చెప్పారు. ‘‘జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఇక్కడే షూటింగ్ జరిపి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో అమెరికాలో 60 రోజులపాటు చిత్రీకరణ జరుపుతాం’’ అని గోపీచంద్ ఆచంట తెలిపారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్: హరీశ్ కట్టా.