
ఆయనతో రొమాన్స్‌కు నేను రెడీ
తమిళసినిమా: వర్ధమాన నటి సాయిపల్లవి నటుడు సూర్యకు గాలం వేస్తోంది. ఈ మలయాళ అమ్మడు అక్కడ తొలిచిత్రం ప్రేమమ్‌తో మలయాళ సినీ ప్రియుల ప్రేమాభిమానాలను పొందేసింది. దీంతో కోలీవుడ్ కన్ను సాయిపల్లవిపై పడింది. మణిరత్నం లాంటి ప్రఖ్యాత దర్శకులు అవకాశం కల్పించడానికి రెడీ అయినా, నటుడు విక్రమ్‌తో జత కట్టే చాన్స్ వచ్చినా ఎంబీబీఎస్ చదువుతున్నానని చెప్పి ఆ అవకాశాలను సున్నితంగానే తిరస్కరించింది.
దీంతో తమిళ చిత్రపరిశ్రమ సాయిపల్లవిని మరచిపోయింది. అలాంటి సమయంలో అనూహ్యంగా టాలీవుడ్‌లో ఫిదా చిత్రంలో ప్రత్యక్షమైంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం చూస్తున్న తెలుగు ప్రేక్షకులిప్పుడు ఫిదా అయిపోతున్నారు. తాజాగా కోలీవుడ్‌లోనూ విజయ్ దర్శకత్వంలో కరు అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం తరువాత తమిళంలో వరుసగా చిత్రాలు చేయాలని నిర్ణయించుకుందట. దీంతో ఇక్కడ అవకాశాల వేట మొదలెట్టిందట.
అందులో భాగంగా తాను కాలేజీ చదువుతున్న రోజల్లోనే నటుడు సూర్య వీరాభిమానినని, ఆయన చిత్రాలు మిస్ కాకుండా చూస్తానని డప్పు కొట్టుకుంటోంది. అంతే కాదు సూర్యతో రొమాన్స్ చేసే అవకాశం ఎప్పుడు వచ్చినా అందుకు రెడీగా ఉన్నానని అంటోంది. ఇక ఇష్టమైన నటి ఎవరమ్మా అంటే ఇంకెవరు అనుష్కనే అని టక్కున చెప్పింది. మాలీవుడ్‌లో ప్రేమమ్‌తోనూ, టాలీవుడ్‌లో ఫిదా చిత్రంతోనూ తన లక్‌ను నిరూపించుకున్న సాయిపల్లవి కోలీవుడ్‌లో కరు చిత్రం కోసం ఎదురుచూస్తోంది.