
తొలిరోజే 'అత్తారింటికి దారేది' రికార్డు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' సినిమా తొలిరోజే రికార్డు సృష్టించింది. శుక్రవారం విడుదలయిన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్లో దాదాపు 10.89 కోట్ల రూపాయలు వసూలు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. టాలీవుడ్లో తొలిరోజే అత్యధిక మొత్తం వసూలు సినిమాగా ఘనత సాధించింది. ఇప్పటిదాకా జూనియర్ ఎన్టీయార్ సినిమా బాద్షా (రూ. 9 కోట్లకుపైగా) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది.
'జల్సా' సినిమా తర్వాత పవన్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాపై విడుదల ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం విడుదలకు ముందే 90 నిమిషాల నిడివి గల పైరసీ సీడీ మార్కెట్లోకి వచ్చినా కలెక్షన్లపై ప్రభావం చూపలేదు. అంచనాలకు తగినట్టే బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల్లో అత్తారింటికి దారేది కలెక్షన్లను కలుపుకొంటే తొలిరోజే మొత్తం 12 కోట్లు రాబట్టినట్టు సిని వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో పవన్ సరసన సమంత, ప్రణీత నటించారు.