
సాక్షి, భీమిలి: సినిమాలో చెప్పిన ఫోన్ నెంబరు ఎంత పని చేసింది... అదే పనిగా సినిమా బాగుందంటూ ఫోన్లు వస్తుంటే ఆ వ్యక్తికి చిర్రెత్తుకొస్తోంది. ఎందుకంటారా.. ఆ సినిమాలో యాదృచ్ఛికంగా చెప్పిన ఫోన్ నెంబరు తన ఫోన్ నెంబరు ఒకటే కాబట్టి. ఈ విశేషమేంటో చదువుదాం. రాజా ది గ్రేట్ సినిమా ఇటీవలే విడుదలైంది. అందులో హీరో రవితేజ అంధుడిగా, ఆయనకు తల్లి పాత్రలో రాధిక నటించారు. గుడ్డి వాడి (హీరో) చేతిలో ఓడిపోవలసి వచ్చిందిరా అని విలన్లు ఒక డైలాగ్ చెబుతారు. ఆ మాటలను సహించలేని రాధిక మీకు ధైర్యముంటే నా కొడుకు(హీరో రవితేజ) వద్ద ఉండే 8074545422 నంబరుకు మీరున్న లొకేషన్‌ను వాట్సాప్‌లో పెట్టి చూడండి.. అప్పుడు తెలుస్తుంది అని అంటుంది.
రవితేజాదిగా రాధిక చెప్పిన ఫోన్ నంబరు విశాఖ జిల్లా ఆనందపురానికి చెందిన లంకలపల్లి గోపి ఫోన్ నెంబరు ఒకటే. దీంతో సినిమా చూసిన చాలామంది ఆ నంబరుకు ఫోన్ చేసి రవితేజ గారండీ.. సినిమా ఎంతో బాగుంది.. మీ నటన అద్భుతం అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. దీంతో రెండు రోజులుగా విరామం లేకుండా ఫోన్ కాల్స్ వస్తుండడంతో విసుగెత్తిన గోపి చివరకు తన ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సి వచ్చింది.
రవితేజకు ఫోన్ ఇమ్మంటున్నారు..
తన నంబర్ ఎవరు ఇచ్చారో తెలియదని లంకలపల్లి గోపి చెప్పారు. సినిమా యూనిట్‌తో తనకు ఎటువంటి సంబంధం లేదని, తనకు తెల్సినవాళ్లు ఎవరూ ఈ సినిమాకు పనిచేయలేదని తెలిపారు. సినిమా చూసిన వాళ్లలో చాలా మంది ఫోన్లు చేస్తున్నారని వాపోయారు. వరుసపెట్టి ఫోన్లు వస్తుండటంతో తనకు చాలా ఇబ్బందిగా ఉందని, ఇప్పటివరకు 300 వరకు ఫోన్ కాల్స్ వచ్చాయని వివరించారు. అర్ధరాత్రి కూడా ఫోన్లు వస్తున్నాయని చెప్పారు. ఫోన్ చేసి సినిమా బాగుందని కొంతమంది, రవితేజతో మాట్లాడాలి ఫోన్ ఇవ్వమని కొందరు అడుగుతున్నారని గోపి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment