జోరుగా ఆటోరిక్షా నడిపా! - కరీనా కపూర్ | Auto led still under way! - Kareena Kapoor | Sakshi
Sakshi News home page

జోరుగా ఆటోరిక్షా నడిపా! - కరీనా కపూర్

Published Fri, Aug 8 2014 11:34 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

జోరుగా  ఆటోరిక్షా  నడిపా!  - కరీనా కపూర్ - Sakshi

జోరుగా ఆటోరిక్షా నడిపా! - కరీనా కపూర్

 ‘‘దక్షిణాది చిత్రాలు బాగుంటున్నాయి. అందుకే హిందీకి అనుగుణంగా ఉన్నవాటిని రీమేక్ చేస్తున్నాం. అలాగే, బాలీవుడ్‌లో నచ్చిన చిత్రాలను ఇక్కడ రీమేక్ చేస్తున్నారు. అది తప్పేం కాదు. ఎవరి కోరికైనా ప్రేక్షకులకు మంచి సినిమా ఇవ్వాలనే’’ అని బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ చెప్పారు. ‘సింగమ్’కి సీక్వెల్‌గా రూపొందిన ‘సింగమ్ 2’లో అజయ్, కరీనా కపూర్ జంటగా నటించిన విషయం తెలిసిందే. రోహిత్‌శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రం ప్రచారం నిమిత్తం అజయ్, కరీనా శుక్రవారం హైదరాబాద్‌కి విచ్చేశారు. అజయ్ దేవగన్ మాట్లాడుతూ -‘‘తొలి భాగంలో ఉన్నట్లుగానే ఇందులోనూ శక్తిమంతమైన సంభాషణలు ఉంటాయి. ఫైట్స్ అయితే ‘సింగమ్’లో కన్నా సహజంగా ఉంటాయి.

ఆ సినిమా విడుదలైన మూడేళ్లకు ఈ సీక్వెల్ చేయడానికి కారణం కథ వెంటనే కుదరకపోవడమే. తమిళంలో రూపొందిన ‘సింగమ్’ సీక్వెల్‌కీ, దీనికీ సంబంధం లేదు. ఓ కొత్త కథాంశంతో ఈ సినిమా ఉంటుంది. తొలి భాగం భారీ విజయం సొంతం చేసుకోవడంతో సీక్వెల్ మాకు పెద్ద సవాల్‌గా నిలిచింది. అందుకే ‘సింగమ్’కన్నా ఈ సినిమా రెండింతలు బాగుండేలా జాగ్రత్త తీసుకున్నాం’’ అని చెప్పారు. తన సతీమణి కాజోల్ సినిమా కెరీర్ గురించి అడిగినప్పుడు.. ‘‘త్వరలో ఓ చిత్రంలో నటించనుంది’’ అని తెలిపారు. ఆమెతో కలిసి మీరు నటిస్తారా? అనే ప్రశ్నకు -‘‘భార్యాభర్తలు కలిసి నటించకపోవడమే మంచిది’’ అని సరదాగా అన్నారు. కరీనా మాట్లాడుతూ -‘‘రోహిత్ శెట్టి ఎప్పుడూ నాకు మంచి పాత్రలే ఇస్తారు. ఇది యాక్షన్ ఓరియంటెడ్ సినిమా కాబట్టి, అజయ్ డామినేషన్ ఉంటుంది. కానీ, నా పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. నాది కామెడీ టచ్‌తో సాగే పాత్ర. ఈ సినిమా కోసం జోరుగా ఆటోరిక్షా నడిపాను’’ అని చెప్పారు. మీరు చేసే వంటల్లో మీ భర్త సైఫ్ అలీఖాన్‌కి నచ్చే వంట ఏది? అనే ప్రశ్నకు -‘‘అసలు నేనెందుకు వంట చేస్తాను? మా ఇంట్లో మంచి కుక్స్ ఉన్నారు. నేను వంట చేసి ఏడెనిమిదేళ్లు అయ్యిందనుకుంటా’’ అన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement