Published
Tue, Sep 19 2017 10:19 AM
| Last Updated on Tue, Sep 19 2017 4:46 PM
ప్లాస్టిక్ సర్జరీ.. నా పర్సనల్: హీరోయిన్
సాక్షి, సినిమా: హీరోయిన్లు తమ అందాలకు మెరుగుపెట్టుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీలను ఆశ్రయించటం కొత్తేం కాదు. అందంగా కనిపిస్తే ఫర్వాలేదుగానీ అందులో తేడా కొట్టేస్తే మాత్రం అయ్యో పాపం అనుకోవాల్సిందే. కొన్నాళ్ల క్రితం నటి అయేషా టకియా విషయంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఆమె ముఖానికి శస్త్ర చికిత్స చేయించుకుందని.. అది వికటించిందని కథనాలు వెలువడ్డాయి.
ఆ సమయంలో ఎటువంటి స్పందన ఇవ్వని అయేషా తాజాగా ఓ ఇంటర‍్వ్యూలో ప్లాస్టిక్ సర్జరీ ప్రస్తావన తీసుకొచ్చారు. తాను అసలు సర్జరీ చేయించుకోలేదని.. అదంతా మీడియా కల్పేనేనని ఆమె తేల్చేశారు. ‘ఆ వార్త వెలువడ్డ సమయంలో నేను కుటుంబంతో గోవాలో ఉన్నా. సోషల్ మీడియాలో ట్రోల్స్ నుంచి తప్పించుకోవటం ఇప్పుడు ఎవరి వల్లా కావటం లేదు. నేనేం తప్పు చేయనప్పుడు.. స్పందించాల్సిన పని లేదనే ఊరుకున్నా’ అని అయేషా చెబుతున్నారు.
మొత్తానికి సర్జరీ వార్తలను తోసిపుచ్చిన అయేషా.. అది పూర్తిగా వ్యక్తిగత వ్యవహారమని, సిగ్గుపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎవరు ఎవరి జీవితాన్ని నిర్ణయించలేరు. ఎవరికి తోచింది వారు చేసేస్తున్నారు. అలాంటప్పుడు నా శరీరాన్ని మార్చుకునే హక్కు నాకు ఉంటుంది కదా అని అయేషా అంటున్నారు. తెలుగులో నాగార్జున సూపర్ చిత్రంతోపాటు బాలీవుడ్‌లో అరడజనుపైగా చిత్రాల్లో నటించిన అయేషా తర్వాత సమాజ్‌వాదీ పార్టీ నేత, వ్యాపారవేత్త ఫర్హాన్ అజ్మీని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె రీఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.