
‘పెళ్లిచూపులు’కు మరో పురస్కారం
రాజమహేంద్రవరం: విజయ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో సినీ నిర్మాత బి.నాగిరెడ్డి పేరిట ఏర్పాటైన బి.నాగిరెడ్డి స్మారక పురస్కారానికి (2016) ‘పెళ్లిచూపులు’ సమగ్ర వినోద ప్రధాన చిత్రంగా ఎంపికైంది. అవార్డు కమిటీలో దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, నటుడు, దర్శకుడు గొల్లపూడి మారుతీరావు ఇతర ప్రముఖులు ఉన్నారు.
పెళ్లిచూపులు చిత్ర నిర్మాత రాజ్ కందుకూరి ఈ పురస్కారాన్ని ఏప్రిల్ 16వ తేదీన రాజమహేంద్రవరంలోని శ్రీవేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో అందుకోనున్నారు. నిర్మాత దివంగత నాగిరెడ్డి కుమార్తె జయలక్ష్మీ రెడ్డి, అల్లుడు ప్రేమ్‌కుమార్ రెడ్డిలతో పాటు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా, సినీ నటుడు జగపతిబాబు, సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేశ్ ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.