బాహుబలి 2 కోసం రూల్స్ మార్చేస్తున్నారట..?
ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలను ఇతర భాషల్లోకి అనువదించి రిలీజ్ చేయటం చాలా కామన్. అలా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల చిత్రాలు ఇతర భాషల్లోకి అనువాదమవుతుంటాయి. అలా అనువాదమైన చిత్రాలు ఘనవిజయం సాధించిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే ఇలాంటి అనువాదాలకు కన్నడ పరిశ్రమ దూరం. కన్నడ సినిమాలు ఏ భాషలోకి అనువాదం కాకపోగా.. మరే భాషా చిత్రాన్ని కన్నడలోకి అనువదించడానికి అంగీకరించరు.
ఒకవేళ కన్నడ నాట తమ సినిమాను రిలీజ్ చేయాలని ఇతర భాషా చిత్ర ప్రముఖులు భావిస్తే ఒరిజినల్ సినిమానే రిలీజ్ చేయాల్సి ఉంటుంది. తమ ఇండస్ట్రీని, తమ నటీనటుల భవిష్యత్తును కాపాడుకోవటానికి కన్నడ సినీ ప్రముఖులు ఎప్పటి నుంచో పాటిస్తున్న కట్టుబాటు ఇది. కానీ బాహుబలి 2 కోసం రూల్ మార్చే ఆలోచనలో ఉన్నారట. కన్నడ నాట కూడా తెలుగు, తమిళ భాషల్లోనే రిలీజ్ అయిన బాహుబలి తొలి భాగం మంచి విజయం సాధించింది.
ఈ నేపథ్యంలో బాహుబలి 2ను కన్నడ ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఇండస్ట్రీ రూల్స్ను మార్చే ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని కన్నడలోకి అనువదించేందుకు అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ ఇండస్ట్రీ ప్రముఖుల అంగీకారం కోరారన్న ప్రచారం జరుగుతోంది. అయితే నిజంగానే అలాంటి చాన్స్ ఉందా..? లేక ప్రమోషన్ కోసమే బాహుబలి పీఆర్ టీం ఇలాంటి వార్తలను సృష్టిస్తుందా..? తెలియాలంటే మాత్రం అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.