
ఆ రోజు జవాబు తెలుస్తుంది!
మాహిష్మతి సామ్రాజ్యానికి కట్టుబానిస కట్టప్ప ‘బాహుబలి’ని ఎందుకు చంపాడు? ఎందుకు? ఎందుకు? అని డాల్బీ డీటీఎస్ సౌండ్‌లో ఎన్నిసార్లు అడిగినా దర్శకుడు రాజమౌళి సమాధానం చెప్పలేదు. సెకండ్ పార్ట్ విడుదల వరకూ వెయిట్ చేయమని చెప్పారు. ఈ ప్రశ్నకు సమాధానం వచ్చే ఏడాది వేసవిలో అందరికీ తెలుస్తుంది. ‘బాహుబలి: ది కంక్లూజన్’ వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదలవుతున్నట్టు ప్రముఖ హిందీ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ ట్వీట్ చేశారు. ‘బాహుబలి: ది బిగినింగ్’ చిత్రాన్ని హిందీలో డిస్ట్రిబ్యూషన్ చేసిందీయనే.
అప్పట్లో ఆ చిత్రం విడుదల తేదీని కూడా కరణ్ జోహారే ప్రకటించారు. ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ, సత్యరాజ్.. ఇలా ఫస్ట్ పార్ట్‌లో నటించిన ప్రధాన పాత్రదారులందరూ సెకండ్ పార్ట్‌లోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి యం.యం.కీరవాణి సంగీత దర్శకుడు.