'బాహుబలి 2' కోసం వినూత్న ప్రచారం
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ బాహుబలి.. మరిన్ని సంచలనాలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే తొలి భాగంతో ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్న బాహుబలి టీం, ఇప్పుడు రెండో భాగం కోసం మరింత భారీగా రెడీ అవుతోంది. అందుకు తగ్గట్టుగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించేందుకు చిత్రయూనిట్ ఏర్పాట్లు చేసుకుంటోంది.
తొలి భాగం ఘనవిజయం సాధించటంతో బాహుబలి పార్ట్ 2 మీద అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. అయితే సినిమా విడుదలకు ఏడాది సమయం ఉండటంతో ఈ హైప్ ఇలాగే కంటిన్యూ చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది చిత్ర నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా. అందుకే హాలీవుడ్ తరహాలో సినిమా క్యారెక్టర్స్తో బొమ్మలు, వీడియో గేమ్లు రూపొందించి మార్కెట్లోకి రిలీజ్ చేయనున్నారు.
ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క, సత్యరాజ్, తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో క్లైమాక్స్ పార్ట్ షూటింగ్ జరుపుకుంటోంది. హలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్తో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.