
విలన్‌గానే నటిస్తాను
- గాయకుడు బాబాసెహగల్
బాబా సెహగల్‌ది దాదాపు పాతికేళ్ల కెరీర్. కానీ ఇప్పటికీ యువతరం గాయకులతో పోటీపడుతూనే ఉన్నారాయన. నిత్యనూతనమైన తన గాత్ర సౌరభంతో భారతీయ శ్రోతలందర్నీ ఊర్రూతలూగిస్తున్నారు. 19 ఏళ్ల క్రితం ‘రిక్షావోడు’ సినిమా కోసం తొలి తెలుగు పాట పాడారు బాబా. ‘రూప్‌తేరా మస్తానా.. నీకు డేరా వేస్తానా...’ అంటూ సాగే ఆ పాట నాటి యూత్‌నే కాదు, నేటి యువతరాన్నీ అలరిస్తూనే ఉంది. దటీజ్ బాబా.
‘జల్సా, ఆర్య2, గబ్బర్‌సింగ్, రగడ...’ ఇలా చాలా సినిమాల్లో బాబా పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందంటే అతిశయోక్తి కాదు. పాప్-ర్యాప్ సంగీతపు దాహార్తిని తీర్చి... పాప్ ఆల్బమ్స్‌కి ఓ గౌరవం తెచ్చిపెట్టిన గాయకుడు బాబా. ఇండియాలో ఇప్పుడొస్తున్న పాప్ గాయకులకు ప్రేరణ ఆయనే. అందుకే.. ‘ఇండి పాప్’కి ఇంటిపేరుగా బాబా సెహగల్‌ని అభివర్ణిస్తుంటారు.
ఇప్పటివరకూ గాయకునిగా అలరించిన ఈ ఎవర్‌గ్రీన్ సింగర్... తొలిసారిగా తెలుగుతెరపై మెరవనున్నారు. వీనుల విందు చేసిన ఆ నేపథ్య స్వరం... త్వరలో గుణశేఖర్ దర్శకత్వంలోని ప్రతిష్టాత్మక చిత్రం ‘రుద్రమదేవి’తో తెరపై ప్రతినాయకునిగా హూంకరించనుంది. ఈ నేపథ్యంలో ఈ హాటెస్ట్ సింగర్... లేటెస్ట్ విలన్‌తో జరిపిన ముచ్చట్లు...
ఏమిటి... హైదరాబాద్‌లోనే ఎక్కువ కనిపిస్తున్నారు?
ఇప్పుడేంటి? దాదాపు పదిహేనేళ్లుగా తెలుగు సినీరంగంతో కలిసి పనిచేస్తున్నాను. ఇక్కడికి వచ్చి పోతూనే ఉన్నాను. ఈ మధ్యే హైదరాబాద్‌లో ఇల్లు కూడా కొన్నాను. అంతేకాకుండా దేశంలోనే ఫస్ట్ హిప్‌హాప్ డ్యాన్స్ అకాడమీని ఇక్కడ నెలకొల్పాను. దీంతో హైదరాబాదీనే అయిపోయా.
అయితే ముంబైని వదిలేసినట్టేనా?
జన్మతః నేను పంజాబీ. చదివింది, పెరిగింది లక్నోలో. ఉద్యోగం, పాప్ ప్రవేశం అంతా ముంబైలోనే. ‘జల్సా’ తర్వాత హైదరాబాద్‌కు రాకపోకలు పెరిగాయి. ఇక్కడ అకాడమీ, తెలుగు సినీగీతాలు పాటలు, సినిమాలో విలన్‌గా నటిస్తుండడం... దీంతో ఇప్పుడు దాదాపు ఇక్కడకు షిప్ట్ అయిపోయా. నా డ్రైవింగ్ లెసైన్స్ కూడా ఇక్కడే తీసుకున్నా. ఓటర్ గుర్తింపు కార్డ్ కూడా తీసుకోనున్నా. అంత మాత్రాన ఒక ఊరిలో నివసిస్తుంటే మరో ఊరిని వదిలినట్టేనని అనలేం.
అవునూ... యాక్టింగ్ వైపు రూటు మార్చారేమిటి?
గతంలో నాలుగైదు హిందీ సినిమాలు చేశాను. కొన్ని తెలుగు ఆఫర్లు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు అన్నీ కుదరడంతో నటిస్తున్నాను. ‘రుద్రమదేవి’ సినిమా అత్యున్నత సాంకేతిక విలువలతో, భారీగా తెరకెక్కుతోన్న సినిమా. అంతేకాకుండా గుణశేఖర్ లాంటి గొప్ప దర్శకుడి దగ్గర పనిచేసే అవకాశం ఇది.
మీ పాత్ర నచ్చిందా?
అద్భుతంగా ఉంది. నాగదేవుడు గెటప్ పోషిస్తున్నప్పుడు వింత అనుభూతి కలుగుతోంది. ఇలాంటి సినిమాలు చేయడమంటే మనకు తెలియని నాటి విషయాలెన్నో తెలుసుకోవడానికి ఉపకరించే పాఠం లాంటిది. ఇంకో విషయం తెలుసా? ఈ పాత్ర కోసం నేనే తెలుగులో డబ్బింగ్ సైతం చెపుతున్నా.
మరింకేం... తెలుగులో నటన కొనసాగిస్తారన్నమాట...
నాకు నచ్చిన పాత్రలు వస్తే చేస్తాను. ‘రుద్రమదేవి’ తర్వాత మరికొన్ని ఆఫర్లు వచ్చాయి. చర్చల దశలో ఉన్నాయి. అయితే ఒకటి.. పక్కా విలన్ క్యారెక్టరైతేనే చేస్తా.
పాప్ సింగర్‌గా నటించే ఛాన్స్ వస్తే...
ఓ... బ్రహ్మాండంగా. ఇక అందులో అయితే నటించాల్సిన పని కూడా లేదు. (నవ్వేస్తూ)
గతంతో పోలిస్తే ప్రైవేట్ పాప్ ఆల్బమ్స్ రాక తగ్గిపోయినట్టుంది...
పెద్ద పెద్ద ఆడియో కంపెనీలు మూతపడ్డాయి. పైగా పొద్దున్న పాడి సాయంత్రం కల్లా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసేస్తే చాలు... ప్రపంచం అంతా చుట్టేస్తుంది.
-ఎస్.సత్యబాబు