
విలేకరులతో మాట్లాడుతున్న సినీనటుడు బాబూమోహన్, పక్కన ఆలీ
సాక్షి, దుగ్గిరాల(గుంటూరు): బాబూ మోహన్ నటించడం లేదంటూ తోటి ఆర్టిస్టులే ప్రచారం చేశారని ప్రముఖ హాస్యనటుడు బాబూమోహన్ వాపోయారు. మండలంలోని పెదపాలెం గ్రామంలో జరిగిన పండు గాడి ఫొటో స్టూడియో సినిమా షూటింగ్‌లో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రిగా పనిచేస్తున్న సమయంలో సినిమాల్లో అవకాశాలు కోల్పోవలసి వచ్చింది. క్యాబినెట్ మంత్రిగా కొనసాగుతూ సినిమాల్లో నటించాలంటే క్యాబినెట్ అనుమతి పొందాల్సి ఉంది. దీనిని కొందరు అవకాశంగా తీసుకుని బాబూమోహన్ నటించడం లేదంటూ తోటి ఆర్టిస్టులే ప్రచారం చేశారు. దీనిలో ఆగ్రగణ్యుడు మా వాడు బ్రహ్మం. రాజకీయంగా ఓటమిపాలైన సమయంలో సరైన క్యారెక్టర్‌లు రాలేదు.
రాజకీయాల్లో పేరు ప్రఖ్యాతులు ఉన్న నేను డబ్బుల కోసం దిగజారుతున్నారని ప్రజలు భావిస్తారని సందేహం కలిగింది. టెర్రర్ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన నాకు జేబులు కొట్టే ఎమ్మెల్యే, జేబులో కత్తెర పెట్టుకుని తిరిగే ఎమ్మెల్యే క్యారెక్టర్‌లలో నటించే అవకాశం కల్పించడంతో తిరస్కరించాను. దీంతో కొంతకాలం నటనకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ మధ్య కాలంలో బిచ్చగాళ్లా... మజాకా అనే సినిమాలో సుమన్‌తో కలిసి యాచకుల సంఘం నాయకుడి పాత్రలో నటించాను. చాల కాలం తరువాత మళ్లీ వినోద్‌కుమార్‌ను కలవడం సంతోషకరంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం నాలుగయిదు సినిమాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment