బాలీవుడ్లో బాహుబలి రికార్డు
మొన్నటి వరకు 100 కోట్లు రూపాయల బిజినెస్ చేసే తెలుగు సినిమా కోసం అందరూ ఎదురు చూశారు. అలాంటిది ఓ తెలుగు చిత్రం వేరే భాషలోకి డబ్ అయి 100 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని కలలో కూడా ఊహించి ఉండరు. రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బాహుబలి చిత్రం ఈ అరుదైన రికార్డు సృష్టించింది.
తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన బాహుబలి.. బాలీవుడ్లో కనక వర్షం కురిపిస్తోంది. బాహుబలి హిందీ వర్సెన్ వంద కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఈ విషయాన్ని ట్విటర్లో తెలియజేశారు. బాలీవుడ్లో ఈ చిత్రం నాలుగో వారం కూడా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. నాలుగోవారం కలెక్షన్లు.. సోమవారం 1.20 కోట్లు, మంగళవారం 1.10 కోట్లు, బుధవారం కోటి, గురువారం 1.10 కోట్లు రాబట్టినట్టు ట్వీట్ చేశారు. మొత్తమ్మీద 107.86 కోట్లు వసూళ్లతో ఆల్ టైం బ్లాక్ బస్టర్గా నిలిచిందని తరణ్ చెప్పారు. ఇప్పటికే బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్లకు పైగా వసూలు చేసింది. దక్షిణాది భాషల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా బాహుబలి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
#Baahubali [dubbed Hindi version; Week 4] Mon 1.20 cr, Tue 1.10 cr, Wed 1 cr, Thu 1.10 cr. Total: ₹ 107.86 cr. ALL TIME BLOCKBUSTER.
— taran adarsh (@taran_adarsh) August 7, 2015