
ఇండియన్ పనోరమాకు ‘బాహుబలి’
సాక్షి, న్యూఢిల్లీ: గోవాలో జరిగే 47వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవంలో ప్రదర్శనకు గాను ఇండియన్ పనోరమాలో తెలుగు నుంచి బాహుబలి విజేతగా నిలిచింది. వివిధ భాషల్లో మొత్తం 230 నామినేషన్లు రాగా 22 సినిమాలు ఎంపికయ్యాయి. 13 సభ్యులు గల జ్యూరీ నెల రోజుల పాటు ఎంపిక ప్రక్రియలో పాల్గొందని కేంద్ర సమాచార శాఖ వెల్లడించింది. ఈ జ్యూరీలో తెలుగు చిత్ర నిర్మాత, దర్శకుడు సి.వి.రెడ్డి కూడా ఉన్నారు.
63వ జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైనందున బాహుబలి చిత్రానికి నిబంధనల ప్రకారం పనోరమ-2016లో కూడా చోటు కల్పించారు. హిందీ భాష నుంచి బాజీరావు మస్తానీ, ఎయిర్ లిఫ్ట్, సుల్తాన్ చిత్రాలు ఎంపికయ్యాయి. నాన్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 198 ఎంట్రీలు రాగా 21 చిత్రాలను ఎంపిక చేశారు.