బజరంగీ.. కలెక్షన్ల సునామీ
ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందించిన బాలీవుడ్ సినిమా బజరంగీ భాయీజాన్ రికార్డులు సృష్టిస్తోంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్లోని అనేక రికార్డులను అది బద్దలు కొట్టింది. భారతదేశంలో ఇప్పటివరకు రూ. 102.60 కోట్ల నెట్ వసూళ్లు, అలాగే ఓవర్సీస్లో కూడా 51 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. వందకోట్ల వసూళ్లు అత్యంత తక్కువ సమయంలో సాధించిన తొలి బాలీవుడ్ సినిమా ఇదేనని దీని గ్లోబల్ డిస్ట్రిబ్యూటర్ ఇరోస్ ఇంటర్నేషనల్ మీడియా తెలిపింది. అలాగే, విడుదలైన మూడోరోజు ఈ సినిమా సాధించిన రూ. 38.75 కోట్లు కూడా ఒకరోజు హిందీ సినిమాలు సాధించిన అత్యధిక కలెక్షన్ అని చెప్పింది.
శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 4,900 స్క్రీన్లలో విడుదలైన బజరంగీ భాయీజాన్ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. సల్మాన్ ఖాన్ ఇప్పటివరకు నటించిన సినిమాలన్నింటిలోకీ దీనికే అత్యధిక వసూళ్లు వస్తాయని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దబాంగ్, బాడీగార్డ్ రికార్డులు దాటిందని, ఇక దబాంగ్ 2, ఏక్ థా టైగర్, కిక్ సినిమాల వసూళ్లను దాటాల్సి ఉందని ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. సల్మాన్ఖాన్ ఫిల్మ్స్, రాక్లైన్ వెంకటేశ్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.