ఆ తర్వాతే ప్రణయ్‌ గురించి తెలిసింది | Baladitya Knows Few Things About Pranay | Sakshi
Sakshi News home page

ప్రణయ్‌, అమృత ప్రేమకథ స్ఫూర్తితో..

Published Mon, Mar 9 2020 8:22 PM | Last Updated on Mon, Mar 9 2020 8:57 PM

Baladitya Knows Few Things About Pranay - Sakshi

గ్యాప్‌ తీసుకోలేదు. నచ్చినవి రాలేదు.. వచ్చినవి నచ్చలేదు.

నర్రా శివనాగేశ్వర రావు (శివనాగు) దర్శకత్వంలో అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం 'అన్నపూర్ణమ్మ గారి మనవడు'. యం.ఎన్‌.ఆర్‌. చౌదరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో మాస్టర్‌ రవితేజ టైటిల్‌ రోల్‌ ప్లే చేశాడు. సీనియర్ నటి జమున, బాలాదిత్య, అర్చన కీలకపాత్రలు పోషిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకులను పలకరించనుంది. ఈ నేపథ్యంలో చిత్ర విశేషాల గురించి బాలాదిత్య ఇలా ముచ్చటించారు.

సినిమాలతో నేను ప్రయాణిస్తూనే ఉన్నాను. 2009లో నటించిన ‘1940లో ఒక గ్రామం’ సినిమాకు నేషనల్ అవార్డ్ వచ్చింది. తర్వాత సినిమాలకు కావాలని గ్యాప్ తీసుకోలేదు. ఎడ్యుకేషన్ కోసం దాదాపు ఐదేళ్లు బ్రేక్ తీసుకున్నాను. ఈ గ్యాప్‌లో నాపై చాలా అపోహలు వచ్చాయి. ఇండస్ట్రీ వదిలి సింగపూర్, మలేషియా వెళ్లిపోయానని కూడా వదంతులు వచ్చాయి. నాకు ఆరేళ్ల వయసు ఉన్నప్పట్నుంచీ నేను నటిస్తున్నాను. ‘చంటిగాడు’ సినిమా టైంలో నాకు 17ఏళ్లు. తర్వాత అమ్మకిచ్చిన మాటకోసం చదవడానికి బ్రేక్ తీసుకున్నాను. ఐదేళ్ల గ్యాప్‌లో చాలామంది నన్ను మర్చిపోయారు. మళ్లీ ఇండస్ట్రీకి వచ్చానని తెలిసిన వాళ్లందరికీ తెలియజేశాను. నచ్చినవి రాలేదు.. వచ్చినవి నచ్చలేదు. మళ్లీ ఇన్నాళ్లకి ఇటీవల ‘ఎంత మంచివాడవురా’ చిత్రంలో నటించాను. తర్వాత నటించిన చిత్రం ‘అన్నపూర్ణమ్మగారి మనువడు’ సినిమాలో కీలక పాత్రను పోషించాను.

అప్పుడు ప్రణయ్‌ గురించి కొన్ని విషయాలు తెలిసాయి
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్, అమృత ప్రేమకథ స్పూర్తితో దర్శకుడు శివనాగు మా క్యారెక్టర్స్ క్రియేట్ చేశారు. పూర్తి సినిమాటిక్‌గా చిత్రీకరించారు. అర్చన నాకు జంటగా నటించారు. మా ఇద్దరి మధ్య ఓ డ్యూయెట్ ఉంది. మార్చి 15న ఆ పాటను విడుదల చేయనున్నారు. సెకండాఫ్‌లో కనిపిస్తాను. పాత్ర నిడివి తక్కువైనా సినిమా మొత్తం నా చుట్టూనే తిరుగుతుంది. ఈ పాత్ర నటుడిగా నాకు మంచి గుర్తింపును తెస్తుందనే నమ్మకముంది. పాపులారిటీ ఉన్న వ్యక్తుల బయోపిక్‌లో నటిస్తే వారిగురించి నటించే ముందు మొత్తం తెలుసుకుంటాం. కానీ ఈ సినిమాలో నటించిన తర్వాత ప్రణయ్ గురించి కొన్ని విషయాలు తెలిసాయి. ప్రస్తుతం తమిళంలో ఓ సీరియల్‌లో నటిస్తున్నాను. ఈటీవీలో వచ్చే ఛాంపియన్ కార్యక్రమం ద్వారా నేను మళ్లీ ప్రేక్షకులకు దగ్గరయ్యాను. (ప్రణయ్‌ హత్య కేసు నిందితుడు మారుతిరావు ఆత్మహత్య)

తెలుగులో ఎలాంటి అవకాశం రాలేదు
టీవీ, సినిమాకు దగ్గర సంబంధం ఉంది. పెద్దవాళ్లే బుల్లితెరపై కనిపిస్తున్నారు. మనం కన్పిస్తే తప్పేముంది అనుకుని ఏ అవకాశం వచ్చినా వదిలిపెట్టడం లేదు. చిరంజీవి, నాగార్జున లాంటి వారు సైతం టీవీ షోస్ చేస్తున్నారు. నటించేవారికి టీవీ షో, సీరియల్, వెబ్ సిరీస్, సినిమా ఏదైనా ఒకటే. ఏదైనా కెమెరా ముందు నటించాల్సిందే. ప్రస్తుతం తమిళ్‌లో రాసాతి అనే సీరియల్‌లో నటిస్తున్నాను. సన్ నెట్ వర్క్ ప్రైమ్ టైంలో ఆ సీరియల్ వస్తుంది. సీరియల్స్‌లో కూడా ప్రేక్షకులు రొటీన్ కార్యక్రమాలు చూడటం లేదు. కొత్త కంటెంట్ ఉంటేనే ఆదరిస్తున్నారు. ఆర్టిస్ట్‌గా ఆ సీరియల్‌లో నటించడం చాలా ఆనందంగా ఉంది. నేను చదువుకుంది చెన్నైలో. ఆ కారణంగా తమిళ్ కూడా నాకు వచ్చు. ఇటీవల జీ5లో ‘గాడ్స్ ఆఫ్ ధర్మపురి’ వెబ్ సీరిస్ లో చేశాను. ప్రస్తుతం తెలుగులో ఎలాంటి అవకాశం రాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement