ట్రైలర్‌ చూస్తే సినిమా హిట్‌ అనిపిస్తోంది – సమంత | Balakrishnudu Movie Audio Launch | Sakshi
Sakshi News home page

ట్రైలర్‌ చూస్తే సినిమా హిట్‌ అనిపిస్తోంది – సమంత

Published Sun, Nov 12 2017 12:25 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

Balakrishnudu Movie Audio Launch - Sakshi

‘‘సినిమా ఇండస్ట్రీలో అందరికీ కావాల్సిన వ్యక్తి మహేంద్ర. బాలకృష్ణగారికి ‘మువ్వగోపాలుడు’, ఎన్టీఆర్‌కి ‘బృందావనం’ హిట్‌ అయినట్లే, ‘బాలకృష్ణుడు’ సినిమా నారా రోహిత్‌కి పెద్ద హిట్‌ అవ్వాలి’’ అని నిర్మాత ‘దిల్‌’ రాజు అన్నారు. నారా రోహిత్, రెజీనా జంటగా పవన్‌ మల్లెల దర్శకత్వంలో బి.మహేంద్రబాబు, ముసునూరు వంశీ, శ్రీ వినోద్‌ నందమూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘దిల్‌’రాజు ట్రైలర్‌ లాంచ్‌ చేశారు.

ఆడియో సీడీలను హీరోయిన్‌ సమంత విడుదల చేయగా, హీరో సాయిధరమ్‌ తేజ్‌ అందుకున్నారు. సమంత మాట్లాడుతూ– ‘‘మహేంద్రగారు నిర్మించిన ఈ తొలి సినిమా పెద్ద సక్సెస్‌ కావాలి. పవన్‌ మల్లెల ఐదేళ్లుగా నాకు మంచి మిత్రుడు. ట్రైలర్‌ చూస్తే సినిమా పెద్ద హిట్‌ సాధిస్తుందనిపిస్తో్తంది’’ అన్నారు. నారా రోహిత్‌ మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన సినిమాలు చేసిన నేను మంచి కథ కుదిరితే కమర్షియల్‌ మూవీ చేయాలనుకున్నా. ఆ టైమ్‌లో పవన్‌ మల్లెల ‘బాలకృష్ణుడు’ కథ చెప్పారు. నాకంటే సినిమా ఎక్కువగా మాట్లాడాలని కోరుకుంటున్నా.

సినిమా కోసం ఎక్కువ ఎఫర్ట్‌ పెట్టాను. పవన్‌ నా వెనక పడి బరువు తగ్గమనేవాడు. నేను తగ్గానంటే ఆ క్రెడిట్‌ తనకే దక్కుతుంది. ఈ నెల 24న సినిమాను విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి ఏం చేయాలని తిరుగుతున్నప్పుడు  మహేంద్రతో స్నేహం కుదిరింది. ఎప్పుడూ తిప్పుతూ ఉండేవాడు. నాకు చిరాకు వచ్చి విజయవాడ వెళ్లిపోయా. సినిమా చేద్దామంటూ హైదరాబాద్‌కు పిలిపించి ‘బాలకృష్ణుడు’ చేయించాడు’’ అన్నారు పవన్‌ మల్లెల. దర్శకులు మారుతి, కల్యాణ్‌ కృష్ణ, హీరో నాగశౌర్య, హీరోయిన్‌ రాశీఖన్నా, నిర్మాత బెల్లంకొండ సురేష్, సంగీత దర్శకుడు సాయికార్తీక్, నటులు ‘వెన్నెల’ కిషోర్, శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement