
మిధున, ప్రదీప్
ప్రదీప్ వలజ, మిధునా ధన్‌పాల్ జంటగా నటించిన చిత్రం ‘భగత్‌సింగ్ నగర్’. వలజ క్రాంతి దర్శకత్వంలో గౌరి, రమేష్ ఉడత్తు నిర్మించారు. భగత్‌సింగ్ 112వ జయంతి సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆవిష్కరించారు. ‘‘ఈ సినిమాలో ప్రేమను ఎలా చూపించారో తెలియదు కానీ పోస్టర్, ఫస్ట్ లుక్స్ బాగున్నాయి’’ అన్నారు సీపీఐ నారాయణ.
‘‘భగత్‌సింగ్ నగర్’ అనే మురికి వాడలో జరిగే ప్రేమకథతో మొదలై థ్రిల్లర్‌గా మారే చిత్రం ఇది’’ అన్నారు క్రాంతి. ‘‘అవకాశాల కోసం వెతుక్కోకుండా మా అన్నయ్య క్రాంతి దర్శకత్వంలోనే నాకీ సినిమా చేసే అవకాశం వచ్చింది’’ అన్నారు ప్రదీప్. ‘‘నాకు తెలిసింది రెండే విషయాలు. సక్సెస్..ఫెయిల్యూర్. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా మంచి సినిమా తీశాననే భావన ఉంది నాకు’’ అన్నారు నిర్మాత రమేష్. ఈ కార్యక్రమంలో సీపీఎం నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి, దర్శకుడు చంద్ర మహేష్ తదితరులు పాల్గొన్నారు.