bhagat singh nagar
-
భగత్‌సింగ్‌నగర్‌లో అగ్ని ప్రమాదం
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: రాంనగర్ డివిజన్ బాగ్‌లింగంపల్లిలోని భగత్‌సింగ్‌నగర్‌లో శుక్రవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భగత్‌సింగ్‌నగర్‌లో 75కు పైగా గుడిసెలు ఉండగా అందులో చిన్నమద్దిలేటి, రాజులకు చెందిన గుడిసెలు పూర్తిగా కాలిపోయాయి. అగ్ని ప్రమాదంపై స్థానికులు ఫైర్ సిబ్బందికి, చిక్కడపల్లి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. తప్పిన పెను ప్రమాదం.. భగత్‌సింగ్‌నగర్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదం వల్ల రెండు గుడిసెలు కాలిబూడిదయ్యాయి. అయితే మంటలు మిగిలిన గుడిసెలకు అంటుకుని ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేదని స్థానికులు చెబుతున్నారు. సకాలంలో ఫైర్ సింబ్బంది అక్కడకు చెరుకుని మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని పేర్కొన్నారు. భగత్‌సింగ్‌నగర్‌లో పనిచేసే వారంతా అడ్డమీది కూలీలు కావడంతో ఉదయం 9గంటల లోపే వారు పనిలోకి వెళ్లిపోతారు. ఈ క్రమంలోనే చిన్నమద్దిలేటి భార్య వంటచేసిన అనంతరం నిప్పులను ఆర్పకుండా పనికి వెళ్లింది. దీంతో ఆ నిప్పురవ్వలతోనే గుడిసెకు మంట అంటుకొని ప్రమాదం సంభవించినట్లు పలువురు చెబుతున్నారు. అదృష్టవశాత్తూ గ్యాస్ సిలిండర్లు పేలలేదని, ఇదే ఘటన రాత్రి సమయంలో జరిగితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేదని భగత్‌సింగ్‌నగర్ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకుంటాం.. అగ్ని ప్రమాద విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే ముఠా గోపాల్ అసెంబ్లీ నుంచి నేరుగా ఘటన స్థాలానికి చేరుకున్నారు. అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా కాలిపోయిన గుడిసెవాసులకు న్యాయం చేస్తామని, నష్టపరిహారం అందేలా చూస్తానని ఎమ్మెల్యే ముఠా గోపాల్ భరోసా కల్పించారు. బీజేపీ ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, కార్పొరేటర్ కె.రవిచారి, టీఆర్ఎస్ నాయకులు ముఠా జైసింహా, ముచ్చకుర్తి ప్రభాకర్, దామోదర్‌రెడ్డి, బబ్లూ, ఆర్.వివేక్ తదితరులు బాధితులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. -
మురికివాడలో ప్రేమ
ప్రదీప్ వలజ, మిధునా ధన్పాల్ జంటగా నటించిన చిత్రం ‘భగత్‌సింగ్ నగర్’. వలజ క్రాంతి దర్శకత్వంలో గౌరి, రమేష్ ఉడత్తు నిర్మించారు. భగత్‌సింగ్ 112వ జయంతి సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆవిష్కరించారు. ‘‘ఈ సినిమాలో ప్రేమను ఎలా చూపించారో తెలియదు కానీ పోస్టర్, ఫస్ట్ లుక్స్ బాగున్నాయి’’ అన్నారు సీపీఐ నారాయణ. ‘‘భగత్‌సింగ్ నగర్’ అనే మురికి వాడలో జరిగే ప్రేమకథతో మొదలై థ్రిల్లర్‌గా మారే చిత్రం ఇది’’ అన్నారు క్రాంతి. ‘‘అవకాశాల కోసం వెతుక్కోకుండా మా అన్నయ్య క్రాంతి దర్శకత్వంలోనే నాకీ సినిమా చేసే అవకాశం వచ్చింది’’ అన్నారు ప్రదీప్. ‘‘నాకు తెలిసింది రెండే విషయాలు. సక్సెస్..ఫెయిల్యూర్. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా మంచి సినిమా తీశాననే భావన ఉంది నాకు’’ అన్నారు నిర్మాత రమేష్. ఈ కార్యక్రమంలో సీపీఎం నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి, దర్శకుడు చంద్ర మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఇరువురి మధ్య ఘర్షణ..ఒకరి మృతి
హైదరాబాద్: ఇద్దరి వ్యక్తుల మధ్య తలెత్తిన వివాదంలో జరిగిన దాడిలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానిక భగత్‌సింగ్ నగర్లో నివాసముంటున్న ఆటోడ్రైవర్ నర్సింహులు, శ్రీను ఇద్దరు శుక్రవారం రాత్రి కల్లు తాగి ఇంటికి వస్తుండగా.. మార్గమధ్యలో వీరి మధ్య వివాదం చెలరేగింది. వాదన పెరిగి పరస్పరం ఒకరి పై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో శ్రీను చేతికి అందిన బండరాయితో నర్సింహులు తలపై బలంగా మోదాడు. దీంతో నర్సింహులు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.