‘‘జర్నలిస్ట్ భగీరథలో ఓ విలక్షణమైన రచయిత ఉన్నాడు. ఆయన రచించిన ‘భగీరథ పథం’ చదివితే ఆ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఎంత మంచి జర్నలిస్టో, అంతకు మించిన రచయిత కూడా. ఆయన నుంచి మరిన్ని పుస్తకాలు రావాలని కోరుకుంటున్నా’’ అని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపా నందేంద్ర సరస్వతి మహాస్వామి అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ భగీరథ రచించిన ‘భగీరథ పథం’ పుస్తకాన్ని హైదరాబాద్‌లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ నటి జమున మాట్లాడుతూ –‘‘నా జీవితాన్ని ‘జమునాతీరం’ పేరుతో భగీరథ రచించారు.
ఆ పుస్తకం నాకెంతో పేరు తెచ్చిపెట్టింది. ‘భగీరథ పథం’ పుస్తకంలో చాలా విషయాలను నిష్పక్ష పాతం గా రాశారు. ఎన్టీ రామారావు జాతీయ అవార్డు నాకు రావడానికి భగీరథే కారణం’’ అన్నారు. ‘‘స్వరూపా నందేంద్ర స్వామివారి చేతుల మీదుగా నా ‘భగీరథ పథం’ పుస్తకావిష్కరణ జరగడం చాలా ఆనందంగా ఉంది. ఇదే స్ఫూర్తితో మరిన్ని రచనలు చేస్తా’’ అన్నారు భగీరథ. నిర్మాత రమేష్ ప్రసాద్, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత కె. అచ్చిరెడ్డి, రచయిత సాయినాథ్, రచయిత్రి పల్లవి, సీనియర్ జర్నలిస్ట్, శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం కార్యదర్శి టి. ఉదయవర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment