ద్రవిడ్ ఒప్పుకుంటాడా?
బెంగళూరు: టీమిండియా మాజీ క్రికెటర్లు మహేంద్రసింగ్ ధోని, సచిన్ టెండూల్కర్, అజారుద్దీన్ జీవిత కథల ఆధారంగా బాలీవుడ్‌లో ఇప్పటికే సినిమాలు తెరకెక్కాయి. ‘మిస్టర్ డిపెండబుల్’ రాహుల్ ద్రవిడ్ జీవితకథను కూడా సిల్వర్ స్క్రీన్‌పైకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. రంగి తరంగ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న ప్రముఖ కన్నడ దర్శకుడు అనూప్ భండారి, నటుడు నిరూప్ భండారి ఈ చిత్రాన్ని రూపొందించేందుకు ముందుకు వచ్చారు. క్రికెట్‌లోనూ ప్రావీణ్యమున్న వీరిద్దరూ తమకు ఆరాధ్యుడైన ద్రవిడ్ జీవిత కథను సినిమాగా తీయాలనుకుంటున్నట్టు వెల్లడించారు.
‘కర్ణాటక రాష్ట్రానికి చెందిన ద్రవిడ్ గురించి ఎవరైనా సినిమా తీయాలనుకుంటే కళ్లుమూసుకుని నిరూప్‌ను ప్రధాన పాత్రకు తీసుకోవచ్చు. అతడి స్వభావం, వ్యక్తిత్వం, మూర్తిమత్వం ద్రవిడ్‌కు దగ్గరకు ఉంటుంది. ఎవరైనా మంచి స్క్రిప్ట్‌తో వస్తే తెరకెక్కించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ద్రవిడ్ అనుమతి ఇస్తేనే ఈ సినిమా రూపొందిస్తాన’ని దర్శకుడు అనూప్ భండారి తెలిపారు. వ్యక్తిగత జీవితం గురించి బయట చర్చించడానికి ఇష్టపడని రాహుల్ ద్రవిడ్ దీనికి ఒప్పుకుంటాడో, లేదో చూడాలి.