భూమికకు కొడుకు పుట్టాడు!
బిడ్డకు జన్మనివ్వడం అంటే పునర్జన్మ ఎత్తినట్లే. ఇటీవలే భూమికకు ఇది అనుభవంలోకొచ్చింది. జస్ట్ రెండు వారాల క్రితమే ఆమె ఓ బాబుకి జన్మనిచ్చారు. ‘బిడ్డకు జన్మనిచ్చేది తల్లి అయితే.. ఆ తల్లికి జన్మనిచ్చేది ఆ బిడ్డే. బిడ్డతో పాటు ఆ తల్లీ పుట్టినట్లే’ అంటున్నారు భూమిక. భరత్ ఠాగూర్‌ని వివాహం చేసుకున్న తర్వాత భూమిక పెద్దగా సినిమాలు చేయలేదు.
ఆ మధ్య ‘ఏప్రిల్ ఫూల్’ అనే చిత్రంలోనూ. రవిబాబు దర్శకత్వంలో ‘లడ్డూబాబు’లోనూ నటించారు. ఈ రెండూ విడుదలకు సిద్దమయ్యాయి. భూమిక తెరపై కనిపించి చానాళ్లయ్యింది కాబట్టి, ఆమె సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేశారని చాలామంది ఊహించారు. కానీ, సినిమాలకు దూరమయ్యే ప్రసక్తే లేదని, గర్భవతిగా ఉన్నప్పుడే ‘ఏప్రిల్ ఫూల్’లో చేశానని భూమిక తెలిపారు.
ప్రస్తుతం మాతృత్వం తాలూకు ఆనందాన్ని అనుభవిస్తున్నారామె. త్వరలో మా అబ్బాయికి నామకరణ మహోత్సవం జరపనున్నామని చెబుతూ -‘‘ప్రెగ్నెన్సీ నుంచి తల్లయిన వరకు జరిగిన ప్రయాణానికి సంబంధించిన అనుభూతిని మాటల్లో చెప్పలేను. పుట్టిన బిడ్డను చూసిన క్షణంలో నేను, భరత్ ఆనందం పట్టలేక ఏడ్చేశాం. బాబుకి ఏ పేరు పెట్టాలో ఇంకా నిర్ణయించుకోలేదు. జీవితంలో వచ్చిన ఈ కొత్త దశ చాలా చాలా బాగుంది’’ అని తెలిపారు.