సంతోషాలు, సరదాలు, చిలిపి పనులు, అలకలు, చిన్నపాటి గొడవలు.. ఇలా నవరసాలు పండిస్తున్న బిగ్‌బాస్ హౌస్ సోమవారం వచ్చేసరికి మాత్రం సీరియస్‌గా మారిపోతుంది. దానికి ప్రధాన కారణం నామినేషన్ అన్న సంగతి తెలిసిందే. నామినేషన్ అనగానే ఇంటి సభ్యుల గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి. అందుకోసం వారు చేసే కసరత్తులు మామూలుగా ఉండవు. ఎవరిని నామినేట్ చేయాలని సాకు వెతుక్కోవడమే కాదు అసలు తనని ఎవరు, ఎంతమంది నామినేట్ చేస్తారో అనే భయం పట్టి పీడిస్తుంది. తీరా నామినేషన్‌కు వచ్చాక సీన్ కాస్తా మరింత పెద్దదైపోతుంది. గొడవ జరగకుండా ఇప్పటివరకు ఏ నామినేషన్ ఎపిసోడ్ పూర్తవకపోవడమే ఇందుకు నిదర్శనం. ఇక ఊహించని రీతిలో వెన్నుపోటులు కూడా నడుస్తాయి. గతవారంలో పునర్నవి, వరుణ్.. రాహుల్‌ను తమ స్నేహితుడు అని చెప్తూనే నామినేషన్‌కు పంపించడమే ఇందుకు ఉదాహరణ.
ఇకపోతే మాస్క్‌లు తీసేయండి.. అని నాగార్జున చెప్పిన మాటలను ఇంటి సభ్యులు ఇప్పుడిప్పుడే పాటిస్తున్నట్టు అనిపిస్తోంది. గత ఎపిసోడ్‌లో జరిగిన మిత్రుడు-శత్రువు-వెన్నుపోటుదారుడు ఆటలో ఇంటి సభ్యులందరూ వారి మనసులో ఉన్నదంతా బయటకు కక్కేశారు. కొంతమంది వారు నొచ్చుకోకుండా చెప్పీ చెప్పనట్టు చెప్పి తప్పించుకున్నారు.. అది వేరే విషయం. అయితే హౌస్‌లో ఓ నలుగురు మాత్రం స్నేహ బంధంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వరుణ్-వితికా-రాహుల్-పునర్నవి ఓ గ్రూప్‌గా ఉంటోన్న విషయం అందరికీ తెలిసిందే. గతవారం నామినేషన్ విషయంలో తనను నామినేట్ చేసినా..లైట్ తీసుకున్నాడు రాహుల్.
హౌస్‌మేట్స్‌లో కొందరు మిగతా ఇంటి సభ్యుల వెనకాల మాట్లాడుకున్న వీడియోలు ప్లే చేయించి హౌస్‌మేట్స్ మధ్య గొడవలు పెట్టేందుకు బిగ్‌బాస్ ప్రయత్నించాడు. దీనిలో భాగంగా వితికా తన గురించి మాట్లాడిన వీడియాను పునర్నవికి చూపించాడు. అప్పటికే వారిద్దరి మధ్య కాస్త గ్యాప్ వచ్చినట్టు కనిపించినా.. ఈ సీన్ తరువాత పునర్నవి చాలా బాధపడింది. బుజ్జగింపులు, క్షమాపణలు, ఎన్నో అలకలు, చివరకు పునర్నవిని వితికా ఎత్తుకు తీసుకెళ్లడంతో గొడవ గురించి మరిచిపోయినట్లు కనిపించింది.
అయితే ఆదివారం నాటి టాస్క్‌లో మళ్లీ మొదటికి వచ్చింది. వితికా తనకు వెన్నుపోటు పొడిచిందని, వరుణ్ తన శత్రువని పేర్కొంది. ఇక నేటి ఎపిసోడ్‌లో కూడా అదే విషయం తెలుస్తోంది. పునర్నవి ఇంకా వితికాను క్షమించలేదని, అందుకే ఆమెను నామినేట్ చేస్తోందని నెటిజన్లు అభిప్రాపడుతున్నారు. దీంతో ఆ నలుగురు కాస్త విడిపోతారేమోనని కామెంట్లు వినిపిస్తున్నాయి. నేడు జరగనున్న నామినేషన్ ప్రక్రియలో రాహుల్-వితికాల్లోంచి వితికాను వరుణ్ సేవ్ చేయాలని చూస్తుండగా.. పునర్నవి వితికాను నామినేట్ చేసింది. అయితే ఇద్దరికి సమాన ఓట్లు రావడంతో కెప్టెన్ శివజ్యోతి నిర్ణయమే ఫైనల్ కావడంతో.. ఆ ఇద్దరిలో ఎవరు నామినేట్ అయ్యారు? ఎవరు సేవ్ అయ్యారు? అనేది తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment