దుబాయ్ : అతిలోక సుందరి, అందాల తార శ్రీదేవీ మృతిపై యావత్తు ప్రపంచం దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. సినీలోకం శోకసంద్రంలో నిండిపోయింది. దుబాయ్ లో బోనీ కపూర్ మేనల్లుడు వివాహ వేడుకకు హాజరైన శ్రీదేవీ, అక్కడే మృతి చెందినట్టు తెలిసింది. అయితే మొదట ఆమె గుండెపోటుతో చనిపోయినట్టు ప్రకటించినా... ఫోరెన్సిక్ రిపోర్టు అనంతరం ఆమె మరణానికి గల కారణాలను వెల్లడించింది. ఆమె గుండెపోటుతో కాదని, ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో పడిపోవడం వల్ల చనిపోయినట్టు పేర్కొంది. అయితే అపస్మారక స్థితిలో బాత్‌టబ్‌లో పడిపోయి ఉన్న శ్రీదేవీని, భర్త బోనీ కపూర్‌తో పాటు, మరో ముగ్గురు సన్నిహితులు దగ్గరిలోని రషీద్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్లేటప్పటికే శ్రీదేవీ చనిపోయినట్టు వైద్యులు గుర్తించారు. ఇదే విషయాన్ని వారికి చెప్పారు.
శ్రీదేవీ మరణ వార్తని బోనీ కపూర్ అసలు తట్టుకోలేక పోయారని పాకిస్తాన్ నటుడు అద్నాన్ సిద్దికి తెలిపారు. ఆ వార్త తెలియగానే ఒక్కసారిగా షాక్‌కి గురైన బోనీ కపూర్, వెక్కి వెక్చి ఏడ్చారని పేర్కొన్నారు. అప్పటికే దుబాయ్‌లో ఉన్న తాను బోనీ సాబ్‌ను కలిసినట్టు అద్నాన్ తెలిపారు. అద్నాన్ శ్రీదేవీ నటించిన 'మామ్' సినిమాలో ఆమెకు కో-స్టార్‌గా చేశారు. పాకిస్తాన్, అమెరికా, యూకే వంటి ప్రాంతాల్లో ఉన్న శ్రీదేవీ అభిమానులంతా ఆమె లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. తనకు సంతాప సందేశాలు పంపుతున్నారన్నారు.
చివరి సారిగా శ్రీదేవీతో ఆ వివాహ వేడుకల్లోనే మాట్లాడినట్టు అద్నాన్ చెప్పారు. ''వివాహ వేడుక రోజు, రాత్రి 12 గంటలకు నా విమానం అక్కడికి చేరుకుంది. అప్పటికే చాలా ఆలస్యమైందని అనుకున్నా. బోనీ సాబ్‌కి కాల్ చేశా. పెళ్లికి రావాలని ఆయన పట్టుబట్టారు. మామ్ సినిమా తర్వాత నేను శ్రీదేవీని మళ్లీ కలువలేదు. నాకోసం వేచిచూస్తున్నారు. చాలా ఆప్యాయంగా నన్ను పలకరించారు. అనంతరం నన్ను ఆమె కుటుంబసభ్యులకు పరిచయం చేశారు. మీరు చాలా ఆలస్యం అని నవ్వుతూ అన్నారు. ఆ మాటలు ఇంకా నా చెవిలో మారుమోగుతున్నాయి. అవే ఆమె చివరగా నాకు చెప్పిన గుడ్‌బై ఏమో'' అని ఆవేదన వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment