శ్రీదేవి అంటే నాకు పిచ్చిప్రేమ! | boney kapoor special interview about valentine's day special | Sakshi
Sakshi News home page

Published Wed, Feb 14 2018 12:26 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

boney kapoor special interview about valentine's day special - Sakshi

బోనీకపూర్, శ్రీదేవి

వాలెంటైన్స్‌ డే సందర్భంగా ‘సాక్షి’తో ముచ్చటించిన బోనీ కపూర్‌.. తన భార్య శ్రీదేవి గురించి ఎన్నో విషయాలు పంచుకున్నారు.  30  ఏళ్ల కిందట ఆమెతో ప్రేమలో పడ్డానని, శ్రీ అంటే తనకిప్పటికీ పిచ్చి ప్రేమ అని చెప్పారు. ఈ ఇంటర్వ్యూ ఇచ్చి దాదాపు పదిరోజులు గడవకముందే శ్రీదేవి ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయారు. హఠాన్మరణంతో ఇటు కుటుంబంలో, అటు సినీ పరిశ్రమలో, అభిమానుల్లో తీరని విషాదాన్నింపారు.  ముఖ్యంగా శ్రీదేవిని అమితంగా ప్రేమించి.. ఆమెను తన అర్ధాంగిగా స్వీకరించిన బోనీ కపూర్‌ తమ అనుబంధం గురించి ఎన్నో విషయాలు చెప్పిన ఆ ఇంటర్వ్యూ మళ్లీ మీకోసం..

‘‘శ్రీ అంటే నాకిప్పటికీ పిచ్చి ప్రేమ. దాదాపు 30  ఏళ్ల క్రితం ఆమెతో ప్రేమలో పడ్డాను. ఆ ప్రేమ ఎప్పటికీ తగ్గదు’’ అన్నారు బోనీ కపూర్‌. బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ని శ్రీదేవి లవ్‌ మ్యారేజ్‌ చేసుకుని 22 ఏళ్లవుతోంది. ‘వాలంటైన్స్‌ డే’ సందర్భంగా ఈ కపుల్‌ లవ్‌స్టోరీని శ్రీదేవి బెటరాఫ్‌ బోనీతో జరిపిన స్పెషల్‌ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం.

► మీది లవ్‌ అట్‌ ఫస్ట్‌ సైట్‌ అట?
అవును. యాక్చువల్‌గా శ్రీ (శ్రీదేవి)ని నేను డైరెక్ట్‌గా చూసి ప్రేమించలేదు. ఒక తమిళ సినిమా చూశాను. స్క్రీన్‌ మీద ఆమెను చూసిన ఫస్ట్‌ టైమే ప్రేమలో పడిపోయాను. వెంటనే శ్రీని కలవాలనిపించింది. బాంబే నుంచి మదరాసు వెళ్లాను. నిజానికి శ్రీ మదరాసులో ఉందో లేదో కూడా తెలుసుకోకుండా వెళ్లాను. తను లేదు. సింగపూర్‌లో షూటింగ్‌ చేస్తోంది. ఎంతో ఎగై్జటెడ్‌గా మదరాసు వెళ్లాను. డిజప్పాయింట్‌మెంట్‌తో బాంబే వెళ్లాను. ఆ తర్వాత హిందీ సినిమా ‘సోలవ్‌ సావన్‌’లో శ్రీని చూశాను. ఎలాగైనా కలవాలని ఆమె నటిస్తోన్న హిందీ సినిమా షూటింగ్‌కి వెళ్లాను. కానీ శ్రీ సరిగ్గా మాట్లాడలేదు. అపరిచితులతో పెద్దగా మాట్లాడదని అర్థమైంది. ఆ రోజు చాలా ముక్తసరిగా మాట్లాడింది. ఆ తర్వాత చాలా రోజుల వరకూ అంతే. తక్కువగా మాట్లాడేది.

► సినిమాలో అంటే మేకప్‌తో కనిపించి ఉంటారు కాబట్టి, గొప్ప అందగత్తె అనుకుని ఉంటారు.. మేకప్‌ లేకుండా చూసినప్పుడు ఏమనిపించింది?
రీల్‌పై అయితే తమిళ్‌ పిక్చర్‌లో చూశాను. రియల్‌గా అయితే ఎయిర్‌పోర్ట్‌లో ఏ మేకప్‌ లేకుండా తనని తానుగా చుశాను. నిజానికి శ్రీ మేకప్‌ లేకుండానే అందంగా ఉంటుంది. ‘షీ ఈజ్‌ మై ఫేవరెట్‌ లేడీ.. ఫేవరెట్‌ స్టార్‌. శ్రీదేవి సింప్లీ సూపర్‌’.

► మీ తమ్ముడు అనిల్‌ కపూర్‌తో నిర్మించిన ‘మిస్టర్‌ ఇండియా’లో శ్రీదేవిగారిని తీసుకోవాలన్నది మీ నిర్ణయమేనా?
శ్రీదేవితో సినిమా తీయాలని ఉండేది. అప్పుడు ‘మిస్టర్‌ ఇండియా’ ప్లాన్‌ చేస్తున్నాం. శ్రీతో సినిమా అంటే వాళ్ల అమ్మని అడిగాలి. కలిసి, అడిగాను. కానీ ఆవిడ పెద్దగా ఇష్టపడలేదనుకుంటా. 10 లక్షలు రెమ్యునరేషన్‌ అడిగారు. అప్పట్లో అంత అంటే పెద్ద విషయం. శ్రీ మీద ఉన్న ఇష్టం, ఆమెకు దగ్గర కావాలనే తపనతో 11 లక్షలిస్తానన్నా. ఒప్పుకున్నారు. ఆ సినిమా టైమ్‌లో మా మధ్య మాటలు పెరిగాయి.

► ఏ భాషలో మాట్లాడుకునేవాళ్లు?
శ్రీ కొంచెం ఇంగ్లిష్, వచ్చీ రాని హిందీలో మాట్లాడేది. నాకు హిందీ, ఇంగ్లిష్‌ వచ్చు. కొంచెం తెలుగు మాట్లాడగలుగుతాను. ప్రొడ్యూసర్‌గా నా ఫస్ట్‌ సినిమాను దర్శకుడు బాపూగారితో తీశాను. ఆ సినిమా పేరు ‘హమ్‌ పాంచ్‌’. తెలుగులో బాపూగారు చేసిన ‘మన ఊరి పాండవులు’కి అది రీమేక్‌. బాపూగారితో నేను మొత్తం మూడు హిందీ సినిమాలు తీశాను. ఆ సమయంలో ఆయన ద్వారా కొంచెం తెలుగు అలవాటైంది. అది నాకు హెల్ప్‌ అయింది. ‘మిస్టర్‌ ఇండియా’ చేస్తున్నప్పుడు శ్రీదేవి అమ్మగారితో ఎక్కువగా తెలుగులో మాట్లాడుతుండేవాణ్ణి. దాంతో ఇంకొంచెం తెలుగు నేర్చుకోగలిగాను. ఇప్పుడైతే 80 పర్సంట్‌ తెలుగు అర్థం చేసుకోగలుగుతాను.

► శ్రీదేవిగారికి లవ్‌ ప్రపోజ్‌ చేసినప్పుడు ఆమె ఏమన్నారు?
మూడు నెలల పాటు ఏమీ చెప్పలేదు తను. తర్వాత ఓకే చెప్పింది. ఆ మూడు నెలల్లో నేను చాలా టెన్షన్‌ పడ్డాను (నవ్వుతూ).

► శ్రీదేవిగారి అమ్మగారు ఏమన్నారు?
యాక్చువల్లీ ఆవిడకు నా మీద మంచి అభిప్రాయం ఉండేది. ఏదైనా ప్రాబ్లమ్‌ వస్తే నాతో డిస్కస్‌ చేసేవారు. ఫస్ట్‌ టైమ్‌ ఆమె మా ఇంటికి వచ్చినప్పుడు ‘బోనీజీ లాంటి అబ్బాయితో మా అమ్మాయికి ముడిపెట్టాలి’ అన్నారు. అప్పటికే ఆవిడకు నేనంటే చాలా నమ్మకం కుదిరింది. అందుకే తన కూతురికి నాలాంటి అబ్బాయి భర్తగా రావాలని కోరుకున్నారు. చివరికి ఆవిడ కోరిక నెరవేరింది.

► మీ అత్తగారికి మీ మీద అంత నమ్మకం ఏర్పడటానికి కారణం ఏంటి?
శ్రీ విషయంలో నేను చాలా కేరింగ్‌గా ఉండేవాణ్ణి. 30 ఏళ్ల క్రితం ‘కార్‌వ్యాన్‌’ ఉండేది కాదు. ‘మిస్టర్‌ ఇండియా’ సమయంలో శ్రీకి సెపరేట్‌గా మేకప్‌ రూమ్‌ ఏర్పాటు చేశాను. నా బేనర్లో వర్క్‌ చేస్తున్నప్పుడు శ్రీకి ఎలాంటి కష్టం కలగకూడదనుకున్నా. అది తన అమ్మగారు గ్రహించారు. అలాగే శ్రీ ‘చాందిని’ సినిమా షూటింగ్‌ చేస్తూ స్విట్జర్లాండ్‌లో ఉంటే, తనని కలవడం కోసం అక్కడికి వెళ్లాను. ఇవన్నీ చూసి, శ్రీ మీద నాకెంతో ప్రేమ ఉందో మా అత్తగారు అర్థం చేసుకున్నారు. అందుకే కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు.

► మీ అత్తగారితో మీకు మంచి బాండింగ్‌ ఉండేది కదా?
అవును. శ్రీ కోసం ఆమె చాలా తపన పడ్డారు. నా మీద చాలా నమ్మకం ఉంచారు. ఆ నమ్మకాన్ని నేను నిజం చేశాను. ఆవిడకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఓ కొడుకులానే చూసుకున్నాను. ఆ సమయంలో శ్రీ చాలా దిగులు పడేది. తనని ఓదార్చడంతో పాటు అత్తగారిని బాగా చూశాను. అందుకే ఆవిడ సంతృప్తిగా కన్ను మూశారు. ఆ టైమ్‌లో శ్రీకి నేనిచ్చిన సపోర్ట్‌ మా మధ్య మరింత అనుబంధం పెంచింది. 1996లో మేం పెళ్లి చేసుకున్నాం.

► డైట్‌ విషయంలో శ్రీదేవి స్ట్రిక్ట్‌గా ఉంటారు. మీరేమో భోజనప్రియుడిలా కనిపిస్తున్నారు?
(నవ్వేస్తూ).  కరెక్టే. డైట్‌ విషయంలో తను చాలా పర్టిక్యులర్‌గా ఉంటుంది. తను కంట్రోల్‌ చేసుకుంటూ నన్ను కంట్రోల్‌ చేస్తుంటుంది. వాస్తవానికి నేను భోజనప్రియుణ్ణి. హైదరాబాద్, చెన్నై వంటకాలు అంటే చాలా ఇష్టం నాకు. సదరన్‌ స్పైస్‌ ఆఫ్‌ తాజ్‌ నా ఫేవరెట్‌ రెస్టారెంట్‌. వారు నాకోసం స్పెషల్‌ ఫుడ్‌ను ఎరేంజ్‌ చేస్తారు. వీలు దొరికినప్పుడు ఫుడ్‌ లాగించడానికి ట్రై చేస్తాను. అలా చేస్తానని తనకి తెలుసు. చిన్నగా మందలిస్తుంది. నాకు రెండే రెండు బలహీనతలు. ఫస్ట్‌ నా కుటుంబం అయితే రెండోది నాకు ఇష్టమైన ఫుడ్‌.

► శ్రీదేవిగారు యాక్ట్‌ చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చినవి?
ఒక రాధ ఇద్దరు కృష్ణులు, జగదేకవీరుడు అతిలోక సుందరి, క్షణ క్షణం, తమిళ్‌ నందకోకిల, హిందీ సద్మా ఇష్టం. జితేంద్రతో శ్రీ చేసిన ‘హిమ్మత్‌వాలా’ అంటే కూడా చాలా ఇష్టం. యాక్చువల్‌గా శ్రీతో ఎలాగైనా సినిమా తీయాలని బలంగా అనిపించడానికి ఆ సినిమా కూడా ఓ కారణం. అప్పుడే మా నాన్నగారి (నిర్మాత సురేందర్‌ కపూర్‌)తో శ్రీదేవితో సినిమా తీయాలనుందని చెప్పాను.

► భార్యగా, అమ్మగా శ్రీదేవిగారి గురించి?
మా పిల్లలు జాన్వీ, ఖుషీ ‘బ్లెస్డ్‌’ అని చెప్పాలి. శ్రీదేవి ఫెంటాస్టిక్‌ మదర్‌. పిల్లలతో చాలా క్లోజ్‌గా ఉంటుంది. ఓ ఫ్రెండ్‌లా అన్నీ అడిగి తెలుసుకుంటుంది. వారి ప్రతి అవసరాన్ని గుర్తించి, అది నెరవేరుస్తుంది. నా జీవితంలోకి తను రావడం నా అదృష్టం. మా పిల్లలు, నేను లక్కీ. కుటుంబానికి చాలా టైమ్‌ స్పెండ్‌ చేస్తుంది. చెప్పాలంటే మా ఫ్యామిలీకి తను ఒక పిల్లర్‌. ప్రతి మగాడి విజయం వెనక ఓ స్త్రీ ఉంటుంది అంటారు. నా సక్సెస్‌ వెనకాల నా భార్య శ్రీదేవి ఉంది.

► మీ ఆవిడ గొప్ప అందగత్తె కదా.. ‘శ్రీదేవి అంటే చాలా లవ్‌’ అని కొంతమంది ఓపెన్‌గా స్టేట్‌మెంట్స్‌ ఇస్తుంటారు.. మీకేమైనా ఇబ్బందిగా ఉంటుందా? ఇన్‌సెక్యూర్టీ ఏమైనా?
నాకెలాంటి ఇన్‌సెక్యూరిటీ లేదు. కో–స్టార్స్, డైరెక్టర్స్‌ శ్రీతో ఫ్రెండ్లీగా ఉంటారు. ఆ విషయంలో నాకు జెలసీ కూడా లేదు. తనేంటో నాకు తెలుసు. నేనేంటో తనకు తెలుసు. ఒక భర్తగా ఆమెను చూస్తే నాకెంతో గర్వంగా ఉంటుంది. మా మ్యారేజ్‌ లైఫ్‌లో మేం ఇన్‌సెక్యూర్టీకి గురైన ఇన్సిడెంట్స్‌ లేవు. ‘ఐయామ్‌ స్టిల్‌ మ్యాడ్లీ ఇన్‌ లవ్‌ విత్‌ హర్‌’.

► మీ పిల్లలు జాన్వీ, ఖుషీల్లో అమ్మ కూచి ఎవరు? నాన్న కూచి ఎవరు?
అలా ఏం లేదు. మేమిద్దరంటే చాలా ఇష్టం. కాకపోతే మా పెద్దమ్మాయి జాన్వీ తన తల్లిలా. ఖుషీ మాత్రం నాలా. శ్రీ  డైట్‌ వేరు. నా డైట్‌ వేరు. అమ్మ తిన్నట్లుగా జాన్వీ తింటుంది.  ఖుషీ మాత్రం నన్ను ఫాలో అవుతుంది. శ్రీ దృష్టంతా హెల్తీ ఫుడ్‌ మీద ఉంటుంది. మేమంతా రెస్టారెంట్‌కి వెళితే, అక్కడ కూడా తన డైట్‌ ప్రకారమే ఆర్డర్‌ ఇస్తుంది.  ఫుడ్‌ విషయంలోనే కాదు... ఫ్యాషన్‌ విషయంలో కూడా జాన్వీ తన తల్లిని ఫాలో అవుతుంది.

– డి.జి. భవాని

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement