శ్రీకాంత్ దీపాల, మిస్తీ చక్రవర్తి, ఆది సాయికుమార్, డైమండ్ రత్నబాబు, సాయి కార్తీక్
‘నాన్నగారూ.. నేనొక బృహత్తరమైన నిర్ణయం తీసుకున్నాను..’ అనే హీరో ఆది చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ‘బుర్రకథ’ సినిమా టీజర్ వినోదాత్మకంగా ఉంది. ‘బ్రహ్మచారి మఠంలో సన్యాసం తీసుకుంటున్నా నాన్నగారూ..’’ అని ఆది చెప్పే డైలాగ్‌కి తండ్రి రాజేంద్రప్రసాద్ అవాక్కవుతాడు. ‘నీ కొడుకు రెండు బ్రెయిన్లతో పుట్టాడు’ అంటూ డాక్టర్ పోసాని కృష్ణమురళి చెప్పగానే.. ‘రామ్‌గోపాల్ వర ్మ తిరుపతికి వెళ్లినప్పుడే ఇలాంటిదేదో జరుగుతుందని ఊహించాను’ అంటూ రాజేంద్రప్రసాద్ నిట్టూరుస్తాడు.
ఆది సాయికుమార్, మిస్తీ చక్రవర్తి జంటగా నటిస్తున్న చిత్రం ‘బుర్రకథ’. ‘పిల్లా నువ్వులేని జీవితం, ఈడోరకం, ఆడో రకం’ సినిమాలతో రచయితగా పెద్ద విజయాల్ని అందుకున్న డైమండ్ రత్నబాబు ఈ సినిమాతో దర్శకుడిగా మారారు. బీరమ్ సుధాకర్‌రెడ్డి సమర్పణలో దీపాల ఆర్ట్స్ పతాకంపై శ్రీకాంత్ దీపాల, కిషోర్ నిర్మిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, పోసాని కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్, టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు.
దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ– ‘‘నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తొలుత పరిచయం అయిన వ్యక్తి రత్నబాబు. ఓ డైరెక్టర్‌కి దర్శకత్వశాఖతో పాటు సంభాషణలు రాయడంలో పరిజ్ఞానం ఉండాలని ఆయన వద్దే నేర్చుకున్నాను’’ అన్నారు. ‘‘ఏ దర్శకుడికైనా తొలి సినిమా ముఖ్యం. నేను, శివ నిర్వాణ తొలి సినిమా అడ్డంకిని విజయవంతంగా దాటివచ్చాం. ఇప్పుడు డైమండ్ రత్నబాబు వంతు. ‘బుర్రకథ’తో తను హిట్టు దర్శకుల జాబితాలతో నిలవాలి’’ అన్నారు దర్శకుడు అజయ్ భూపతి. ‘‘మరుధూరి రాజా తర్వాత నాకు బాగా ఇష్టమైన సంభాషణల రచయిత రత్నబాబు.
దర్శకుడిగా అతడికి ఈ సినిమా పెద్ద విజయాన్ని తెచ్చిపెట్టాలి. ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమా ఆదితో చేయాల్సింది. కానీ, కుదరలేదు’’ అన్నారు డైరెక్టర్ ఏ.ఎస్. రవికుమార్ చౌదరి. ‘‘రెండు బ్రెయిన్‌లు ఉన్న ఓ యువకుడి కథ ఇది. ఆ పాయింట్‌లో నుంచే వినోదం పుడుతుంది. రామ్, అభి పాత్రలు విభిన్నంగా ఉంటాయి. తెనాలి రామలింగడి తరహా పాత్రలో రాజేంద్రప్రసాద్ కనిపిస్తారు’’ అన్నారు డైమండ్ రత్నబాబు. ‘‘జూన్ మొదటివారంలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత శ్రీకాంత్. ‘‘డిఫరెంట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్ ఉంటుంది’’ అని ఆది తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయికార్తీక్, గాయత్రి గుప్తా, మణిచందన్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment