
అమితాబ్,అభిషేక్ పై ఫిర్యాదు
బాలీవుడ్ సూపర్ స్టార్ , బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు, బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్పై అనూహ్యంగా ఒక కేసులో ఇరుక్కున్నారు. జాతీయజెండాను, జాతిని అవమానించారనే ఆరోపణలపై ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో వీరిద్దరిపైన కేసు నమోదైంది.
లక్నో: బాలీవుడ్ సూపర్ స్టార్ , బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు, బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ అనూహ్యంగా ఒక కేసులో ఇరుక్కున్నారు. జాతీయ జెండాను, జాతిని అవమానించారనే ఆరోపణలపై ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో వీరిద్దరిపైన కేసు నమోదైంది. త్రివర్ణ పతాకాన్ని అవమానించారని ఆరోపిస్తూ చేతన్ ధిమన్ ఆనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేశారు.
ఇండియా పాకిస్తాన్ ప్రపంచ కప్ సందర్భంగా అడిలైడ్లో జరిగిన క్రికెట్ మ్యాచ్లో ఫిబ్రవరి 15న తమ ఒంటిపై జాతీయ జెండాను కప్పుకుని భారతీయ జెండాను కించపరిచారని చేతన్ ఆరోపించారు. తండ్రీ కొడుకులిద్దరూ తమ ఒంటిపై జాతీయ పతాకాన్ని ధరించి జాతికి తీరని అవమానం చేశారని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు ఆయన ఫిర్యాదు చేశారు. ఈ చర్య భారతదేశ గౌరవానికి భంగం కలిగించిందన్నారు.
ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న మెగాస్టార్ అమితాబ్లాంటి వారు ఇలా జాతికి అవమానకరంగా ప్రవర్తించడం శోచనీచయని చేతన్ లాయర్ సంజీవ్ శర్మ వ్యాఖ్యానించారు. 1971 జాతి గౌరవ చట్టం ప్రకారం ఇది నేరమని, ఈ కేసులో తండ్రీ కొడుకులిద్దరికీ సమన్లు జారీ చేయాలని ఆయన వాదిస్తున్నారు.