హిమాయత్‌నగర్ :దీపావళి పండగకు ఎంతో ప్రత్యేకత ఉంది. కొత్త దుస్తులు ధరించి, స్వీట్లు ఇచ్చిపుచ్చుకుని శుభాకాంక్షలు చెప్పుకోవడంలో ఉండే ఆ ఆనందమే వేరు. సాయంత్రానికి టపాసులు కాల్చుతూ పండగను ఆస్వాదించడం ప్రతి ఏటా ఆనవాయితీ. అయితే ఈ బిజీ లైఫ్‌లో సెలబ్రిటీస్‌కు పండగను జరుపుకునేందుకు సమయమే దొరకట్లేదు. దొరికిన కొద్ది సమయంలో వేరే వేరు పనులతోనే సరిపోతుంది. ఎన్ని పనులున్నా..ఎంత బిజీ లైఫ్ అయినా ఈ దీపావళిని కుటుంబ సభ్యులతో జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. మన టాలీవుడ్ హీరో, హీరోయిన్స్. పొద్దున్నే అమ్మ, నాన్నలకు విషెస్ చెప్పి, కొత్త దుస్తులు ధరించి, సాయంత్రానికి పూజల్లో పాల్గొని, ఆ తరువాత చిన్నపాటి టపాసులు కాల్చి పండగను ఎంతో సేఫ్‌గా జరుపుకోనున్నట్లు వివరించారు. దీపావళిని ఎలా జరుపుకోబోతున్నారు అనే విషయాలపై సెలబ్రిటీలతో ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
ఈసారి అమ్మానాన్నలతో..
కొన్ని సంవత్సరాలుగా దీపావళి పండగకు అమ్మ,నాన్నలిద్దరూ అమెరికాలో ఉంటున్నారు. ఇక్కడ నేను స్నేహితులతో కలసి పండగ చేసుకునేవాడిని. గూఢచారి సినిమా విజయవంతం అవ్వడం ఒక ఆనందమైతే. ఈ దీపావళికి అమ్మానాన్నలు సిటీలోనే ఉండటం మరో ఆనందమైన విషయం. రెండు ఆనందాల మధ్య పంచెకట్టుతో దీపావళి చేసుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. క్రాకర్స్‌కు నేను చాలా దూరం. చిన్నపిల్లలు సరదా కోసం క్రాకర్స్‌ను కాలుస్తారు. వారి విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి. పొల్యూషన్ ఫ్రీగా పండగ జరుపుకోవడంతో పాటు రోడ్డుపై చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేసుకుంటే మనకే బాగుంటుంది. –అడవి శేషు(సన్నీ), సినీ హీరో
సేఫ్ దీపావళి జరుపుకుంటాం...
దీపావళి అంటే ఆనందం, భయం కూడా ఉంటుంది. టపాసుల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో పాటు ప్రకృతికి కూడా హాని కలుగుతుంది. కాబట్టి కాకరపువ్వొత్తులు లాంటివి కాలుస్తా. ఉదయం నుంచి కుటుంబ సభ్యులు, స్నేహితులతో చెన్నైలో పండగ జరుపుకుంటా. మేముసేఫ్ దివాళీ జరుపుకుంటాం, మీరు కూడా సేఫ్‌గా, ఆనందంగా జరుపుకోవాలి.–విమలారామన్, హీరోయిన్
రెండో ఫెస్టివల్ పంజాబ్‌లో...
నేను ఆల్‌రెడీ రెండ్రోజుల క్రితం సిటీలో స్నేహితులతో కలసి దీపావళి జరుపుకున్నా. మా అమ్మ, నాన్న, బంధువులు అంతా పంజాబ్‌లో ఉన్నారు. సో... రెండో ఫెస్టివల్‌ను కుటుంబ సభ్యులతో కలసి పంజాబ్‌లో జరుపుకుంటున్నా. పర్యావరణానికి హాని కలగకుండా ప్రతి ఒక్కరూ దీపావళి జరుపుకుంటే అందరూ బాగుంటారు. –సోనూసూద్, నటుడు
ఈ దివాళీ ఎంతో ప్రత్యేకం
ఈ దివాళీ నాకు ఎంతో ప్రత్యేకం. ఇటీవల విడుదలైన అరవిందసమేత, సవ్యసాచి సినిమాలు హిట్ అవ్వడం, షాపింగ్‌కు వెళ్లినప్పుడు బాగా యాక్ట్ చేశావ్ అని పబ్లిక్ విష్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందంతో ఎంతో ఇష్టమైన దివాళీని ఇంట్లో అందరితో కలసి సెలబ్రేట్ చేసుకోబోతున్నా. క్రాకర్స్‌కి చాలా దూరం ఈసారి. అందరూ చక్కగా, సేఫ్‌గా పండగ చేసుకోవాలి. – ఈషారెబ్బ, హీరోయిన్
పోలాండ్‌లో తోటి ఆటగాళ్లతో
లాస్ట్ ఇయర్ ఫెస్టివల్ ఇక్కడే అమ్మ, అక్క, బావ, పిల్లలతో జరుపుకున్నా. క్రాకర్స్ కాల్చి పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేశా. ఈసారి నాకు ఆ అదృష్టం లేదు. గేమ్స్ నిమిత్తం పోలాండ్‌లో ఉన్నా. అయితే మన సాంప్రదాయం ఉట్టిపడేలా దుస్తులు ధరించి, ఇతర దేశాలకు చెందిన నా తోటి క్రీడాకారులుతో సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీ అయ్యా. వాళ్లు కూడా దీపావళి కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు. –బుద్దా అరుణారెడ్డి, జిమ్నాస్టిక్
శబ్దం లేకుండా...
పొద్దు, పొద్దున్నే అమ్మ, నాన్నలకు దీపావళి శుభాకాంక్షలు చెప్పడం. ఆ తర్వాత పక్కంటి వాళ్లకు స్వీట్లు ఇచ్చి పండగ విషెస్ చెప్పడం. సాయంత్రానికి కుటుంబ సభ్యులతో పాటు, స్నేహితులు, వాళ్ల కుటుంబ సభ్యులందరం ఒక్క చోట కలుస్తాం. పూజలు చేసి, శబ్ధం లేని దీపావళిని ఘనంగా జరుపుకుంటాం. దీంతో పాటు మా నక్షత్ర ఫౌండేషన్ సభ్యులందరం కలసి పండగను జరుపుకోబోతున్నాం.– మాధవీలత, హీరోయిన్
Comments
Please login to add a commentAdd a comment