మంత్రుల జోక్యం నచ్చకే.. లీలా శాంసన్
న్యూఢిల్లీ: గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కీలకపాత్ర పోషించిన వివాదాస్పద చిత్రం 'మెస్సెంజర్ ఆఫ్ గాడ్'కి సెన్సార్ బోర్డు సర్టిఫికేషన్ ఇచ్చింది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ఎక్కడా వెల్లడించలేదు. సినిమా ధ్రువీకరణ అప్పీళ్ల ట్రిబ్యునల్, సెన్సార్ బోర్డు చీఫ్ లీలా శాంసన్ ఈ క్లియరెన్స్ నేపథ్యంలో రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకి తెలిపినట్లు ఆమె చెప్పారు. సినిమాల సర్టిఫికేషన్ విషయాల్లో మంత్రుల జోక్యం చేసుకోవడం నచ్చని కారణంగా లీలా శాంసన్ తన పదవికి రాజీనామా చేశారు.
'మెస్సెంజర్ ఆఫ్ గాడ్' శుక్రవారం రోజు విడుదల కావాల్సి ఉంది. కాగా సెన్సార్ బోర్డు క్లియరెన్స్ విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. బోర్డు విషయాల్లో మంత్రులు జోక్యం చేసుకోవడం హాస్యాస్పదంగా మారిందని లీలా అన్నారు. మంత్రిత్వశాఖ నియమించిన ప్యానెల్ సభ్యులు, అధికారుల అవినీతి, జోక్యం కారణంగా రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. గత తొమ్మిది నెలలుగా మంత్రిత్వశాఖ మాకు నిధులు ఇవ్వకపోగా, బోర్డు సమావేశాలకు అనుమతివ్వలేదని లీలా చెప్పారు. తన రాజీనామాపై వెనక్కి తగ్గేది లేదని ఆమె స్పష్టం చేశారు.