సెన్సార్ బోర్డ్పై ఫైర్ అయిన డైరెక్టర్
రియలిస్టిక్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మధుర్ బండార్కర్. తన సినిమాలతో ఎన్నో వివాదాలకు కారణమయ్యే మధుర్ మరో వివాదాస్పద చిత్రాన్ని తెర మీదకు తెచ్చాడు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించినప్పటి పరిస్థితుల నేపథ్యంలో ఇందు సర్కార్ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో ఇందిరా గాంధీని పోలిన పాత్రతో పాటు సంజయ్ గాంధీ పాత్రలను తప్పుగా చూపించారన్న టాక్ వినిపిస్తోంది.
తాజాగా ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఏకంగా 14 కట్లు సూచించారట. సినిమాలో చూపించిన మొరార్జీ దేశాయి, వాజ్ పేయ్, అధ్వానీ లాంటి ప్రముఖుల ఫోటోలను తొలగించాలని, 'అబ్ ఇస్ దేశ్ మే గాంధీ కే మైనే బదల్ చుకే హై (ఈ దేశంలో గాంధీని ఇప్పుడు నేను మార్చేశాను), భారత్ కి ఏక్ బేటీ నే దేశ్ కో బందీ బనాయా హువా హై (భారత్కు చెందిన ఓ కూతురు దేశం మొత్తాన్ని బందీ చేసింది), ఔర్ తుమ్ లోగ్ జిందగీ బర్ మా బేటే కి గులామీ కర్తే రహోగే (మీరు జీవితాంతం ఆ తల్లీ కొడుకులకు గులాంగిరీ చేస్తూనే బతికేస్తారా)' లాంటి డైలాగ్ లను తొలగించాలని సూచించారు.
అంతేకాదు సినిమాలోఉపయోగించిన ప్రముఖుల పేర్లు వినిపించకుండా మ్యూట్ చేయాలని ఆదేశించారు. దీంతో దర్శకుడు మధుర్ బండార్కర్ సెన్సార్ బోర్డ్ పై ఫైర్ అవుతున్నాడు. గతంలో ట్రైలర్ సెన్సార్ చేసిన సమయంలో అభ్యంతరం పెట్టని సభ్యులు సినిమాకు కట్ చెప్పటం ఏంటని ప్రశ్నిస్తున్నాడు. అందుకే సెన్సార్ ఇచ్చిన కట్స్ పై రివైజింగ్ కమిటీని ఆశ్రయించాలని నిర్ణయించారు.