Indu Sarkar
-
సుప్రీం గ్రీన్‌సిగ్నల్.. రేపే విడుదల!
న్యూఢిల్లీ: దర్శకుడు మధుర్ భండార్కర్ తెరకెక్కించిన 'ఇందూ సర్కార్' సినిమా విడుదలపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ సినిమా విడుదలపై స్టే విధించాలన్న పిటిషన్‌ను జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అమితావ్ రాయ్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్లతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. ఈ సినిమా చట్టబద్ధ పరిమితులకు లోబడిన కళాత్మక వ్యక్తీకరణ అని పేర్కొంది. 1975లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ ఇతివృత్తంగా 'ఇందూ సర్కార్' సినిమా తెరకెక్కింది. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని, వాస్తవాలను వక్రీకరించి.. పూర్తిగా కించపరిచేలా ఈ సినిమాను తెరకెక్కించారని సంజయ్‌గాంధీ కూతురిగా చెప్పుకుంటున్న ప్రియా సింగ్ పాల్ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. రేపు (శుక్రవారం) ఇందూ సర్కార్ సినిమా దేశవ్యాప్తంగా విడుదలకానుంది. -
సెన్సార్ బోర్డ్‌పై ఫైర్ అయిన డైరెక్టర్
రియలిస్టిక్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మధుర్ బండార్కర్. తన సినిమాలతో ఎన్నో వివాదాలకు కారణమయ్యే మధుర్ మరో వివాదాస్పద చిత్రాన్ని తెర మీదకు తెచ్చాడు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించినప్పటి పరిస్థితుల నేపథ్యంలో ఇందు సర్కార్ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో ఇందిరా గాంధీని పోలిన పాత్రతో పాటు సంజయ్ గాంధీ పాత్రలను తప్పుగా చూపించారన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఏకంగా 14 కట్లు సూచించారట. సినిమాలో చూపించిన మొరార్జీ దేశాయి, వాజ్ పేయ్, అధ్వానీ లాంటి ప్రముఖుల ఫోటోలను తొలగించాలని, 'అబ్ ఇస్ దేశ్ మే గాంధీ కే మైనే బదల్ చుకే హై (ఈ దేశంలో గాంధీని ఇప్పుడు నేను మార్చేశాను), భారత్ కి ఏక్ బేటీ నే దేశ్ కో బందీ బనాయా హువా హై (భారత్‌కు చెందిన ఓ కూతురు దేశం మొత్తాన్ని బందీ చేసింది), ఔర్ తుమ్ లోగ్ జిందగీ బర్ మా బేటే కి గులామీ కర్తే రహోగే (మీరు జీవితాంతం ఆ తల్లీ కొడుకులకు గులాంగిరీ చేస్తూనే బతికేస్తారా)' లాంటి డైలాగ్ లను తొలగించాలని సూచించారు. అంతేకాదు సినిమాలోఉపయోగించిన ప్రముఖుల పేర్లు వినిపించకుండా మ్యూట్ చేయాలని ఆదేశించారు. దీంతో దర్శకుడు మధుర్ బండార్కర్ సెన్సార్ బోర్డ్ పై ఫైర్ అవుతున్నాడు. గతంలో ట్రైలర్ సెన్సార్ చేసిన సమయంలో అభ్యంతరం పెట్టని సభ్యులు సినిమాకు కట్ చెప్పటం ఏంటని ప్రశ్నిస్తున్నాడు. అందుకే సెన్సార్ ఇచ్చిన కట్స్ పై రివైజింగ్ కమిటీని ఆశ్రయించాలని నిర్ణయించారు. -
'సెన్సార్ చేయకముందే ఆ మూవీ చూడాలి'
న్యూఢిల్లీ: ఎమర్జెన్సీ రోజులను నేపథ్యంగా ఎంచుకుని దర్శకుడు మధుర్ భండార్కర్ తీసిన ‘ఇందు సర్కార్’ మూవీపై కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ మూవీని బోర్డు సెన్సార్ చేయకముందుగానే తాను చూడాలని కోరుతూ సెన్సార్ బోర్డు చీఫ్ పహ్లాజ్ నిహలానీకి మంగళవారం ఓ లేఖ రాశారు. తనతో పాటు మరికొందరు పార్టీ నేతలకు ఈ మూవీ స్టోరీపై అనుమానాలున్నట్లు తెలిపారు. 'ఈ మూవీ ట్రైలర్ చూశాను. ఎమర్జెన్సీ రోజుల్లో ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీని, ఆమె కుమారుడు సంజయ్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను చూపించారు. ఇందిరాగాంధీ, సంజయ్ తో పాటు పార్టీకి చెందిన అగ్రనేతలను చెడు కోణంలో చూపించారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ కారణం వల్ల మాకు ఇందు సర్కార్ మూవీని సెన్సార్ చేయకముందే ఓసారి ప్రత్యేక షో చూపించాలని' సీబీఎఫ్సీ చైర్మన్ పహ్లాజ్ నిహలానీని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ మూవీలో తరచుగా ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ పాత్రలు కూడా వచ్చి పోతుంటాయి. ఇందిరా గాంధీగా కొత్త నటి సుప్రియా వినోద్, సంజయ్ గాంధీగా నీల్ నితిష్ నటించాడు. కీర్తి కుల్హారి, అనుపమ్ ఖేర్ కీలకపాత్రల్లో కనిపిస్తారు. 1975 జూన్ 26న మొదలైన ఎమర్జెన్సీ దమనకాండ 21 నెలల తర్వాత 1977 మార్చి 21న ముగిసింది. అనంతరం జరిగిన ఎలక్షన్లలో జనం ఇందిరాగాంధీని చావుదెబ్బ తీయగా, జయప్రకాష్ నారాయణ్ ఆధ్వర్యంలోని జనతాపార్టీని అందలం ఎక్కించారు. మరోవైపు ఇందిరాగాంధీ జీవితంలోనే కాదు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కూడా ఎమర్జన్సీని మచ్చగా, దాచిపెట్టాల్సిన విషయంగా భావిస్తారన్న విషయం తెలిసిందే. -
ఇందు సర్కార్
భారత దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా మధుర్ బండార్కర్ తెరకెక్కించిన చిత్రం ‘ఇందు సర్కార్’. ఆమె విధించిన ఎమర్జెన్సీ పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. ఇందిరా గాంధీ పాత్రను సుప్రియా వినోద్ చేశారు. ఇందిరాగాంధీ రెండో తనయుడు సంజయ్‌గాంధీ రోల్‌ను నీల్ నితిన్ ముఖేష్ చేశారు. ఇందు అనే అమ్మాయి పాత్రను కృతీ కుల్హరీ చేశారు. నిజ జీవిత కథలను తెరెకెక్కించడంలో మధుర్ బండార్కర్ ప్రతిభావంతుడు. ఈ చిత్రం పై అంచనాలు పెరగడానికి అదో కారణమైతే మరో కారణం సుప్రియ, నీల్ నితిన్ లుక్స్. అచ్చంగా ఇందిరా గాంధీలా సుప్రియ లుక్, సంజయ్‌లా నీల్ లుక్ ఉండటం విశేషం. పాత్రలకు తగ్గ ఆర్టిస్టులను ఎన్నుకోవడంలో మధుర్ సిద్ధహస్తుడని లుక్స్ చూసినవాళ్లు అంటున్నారు. ఈ సినిమా జూలై 28న విడుదల కానుంది. -
ఎమర్జెన్సీపై సినిమా తీస్తున్న స్టార్ డైరెక్టర్!
ముంబై: 'ఫ్యాషన్', 'పేజ్-3', 'హీరోయిన్' వంటి విభిన్నమైన సినిమాలు తెరకెక్కించి బాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకున్న దర్శకుడు మధుర్ భండార్కర్. సమాజంలోని చీకటికోణాలపై అత్యంత సాహసోపేతంగా సినిమాలు తీసిన ఈ దర్శకుడు ఇప్పుడు మరో బోల్డ్ ప్రాజెక్టుతో రాబోతున్నాడు. భారత ప్రజాస్వామ్యంలో అత్యంత చీకటికాలంలో ఎమర్జెన్సీ. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశమంతటా అత్యవసర పరిస్థితి విధించారు. 1975 నుంచి 1977 వరకు 21 నెలలపాటు ఎమర్జెన్సీ కొనసాగింది. ఈ 21 నెలల ఎమర్జెన్సీకాలంలో ఏం జరిగిందన్న దానిని తెరకెక్కించేందుకు మధుర్ భండార్కర్ సిద్ధమవుతున్నాడు. 'ఇందూ సర్కార్' పేరిట తీస్తున్న ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తయిందని భండార్కర్ సోమవారం ట్వీట్ చేశాడు. 'ఎమర్జెన్సీ శకానికి చెందిన రాజకీయ నాయకులు, పాత్రికేయులు, ఫొటోగ్రాఫర్లు, రచయితలు, సామాన్యులను కలిసి కొన్ని నెలలపాటు పరిశోధించాను. ఎట్టకేలకు 'ఇందూ సర్కార్' స్క్రిప్ట్ పూర్తయింది' అని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ సినిమాలో నటించే తారాగణం, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.