ఎమర్జెన్సీపై సినిమా తీస్తున్న స్టార్ డైరెక్టర్!
ముంబై: 'ఫ్యాషన్', 'పేజ్-3', 'హీరోయిన్' వంటి విభిన్నమైన సినిమాలు తెరకెక్కించి బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకున్న దర్శకుడు మధుర్ భండార్కర్. సమాజంలోని చీకటికోణాలపై అత్యంత సాహసోపేతంగా సినిమాలు తీసిన ఈ దర్శకుడు ఇప్పుడు మరో బోల్డ్ ప్రాజెక్టుతో రాబోతున్నాడు. భారత ప్రజాస్వామ్యంలో అత్యంత చీకటికాలంలో ఎమర్జెన్సీ. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశమంతటా అత్యవసర పరిస్థితి విధించారు. 1975 నుంచి 1977 వరకు 21 నెలలపాటు ఎమర్జెన్సీ కొనసాగింది.
ఈ 21 నెలల ఎమర్జెన్సీకాలంలో ఏం జరిగిందన్న దానిని తెరకెక్కించేందుకు మధుర్ భండార్కర్ సిద్ధమవుతున్నాడు. 'ఇందూ సర్కార్' పేరిట తీస్తున్న ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తయిందని భండార్కర్ సోమవారం ట్వీట్ చేశాడు. 'ఎమర్జెన్సీ శకానికి చెందిన రాజకీయ నాయకులు, పాత్రికేయులు, ఫొటోగ్రాఫర్లు, రచయితలు, సామాన్యులను కలిసి కొన్ని నెలలపాటు పరిశోధించాను. ఎట్టకేలకు 'ఇందూ సర్కార్' స్క్రిప్ట్ పూర్తయింది' అని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ సినిమాలో నటించే తారాగణం, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.