'సెన్సార్ చేయకముందే ఆ మూవీ చూడాలి'
న్యూఢిల్లీ: ఎమర్జెన్సీ రోజులను నేపథ్యంగా ఎంచుకుని దర్శకుడు మధుర్ భండార్కర్ తీసిన ‘ఇందు సర్కార్’ మూవీపై కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ మూవీని బోర్డు సెన్సార్ చేయకముందుగానే తాను చూడాలని కోరుతూ సెన్సార్ బోర్డు చీఫ్ పహ్లాజ్ నిహలానీకి మంగళవారం ఓ లేఖ రాశారు. తనతో పాటు మరికొందరు పార్టీ నేతలకు ఈ మూవీ స్టోరీపై అనుమానాలున్నట్లు తెలిపారు. 'ఈ మూవీ ట్రైలర్ చూశాను. ఎమర్జెన్సీ రోజుల్లో ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీని, ఆమె కుమారుడు సంజయ్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను చూపించారు.
ఇందిరాగాంధీ, సంజయ్ తో పాటు పార్టీకి చెందిన అగ్రనేతలను చెడు కోణంలో చూపించారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ కారణం వల్ల మాకు ఇందు సర్కార్ మూవీని సెన్సార్ చేయకముందే ఓసారి ప్రత్యేక షో చూపించాలని' సీబీఎఫ్‌సీ చైర్మన్ పహ్లాజ్ నిహలానీని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ మూవీలో తరచుగా ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ పాత్రలు కూడా వచ్చి పోతుంటాయి. ఇందిరా గాంధీగా కొత్త నటి సుప్రియా వినోద్, సంజయ్ గాంధీగా నీల్ నితిష్ నటించాడు. కీర్తి కుల్హారి, అనుపమ్ ఖేర్ కీలకపాత్రల్లో కనిపిస్తారు.
1975 జూన్ 26న మొదలైన ఎమర్జెన్సీ దమనకాండ 21 నెలల తర్వాత 1977 మార్చి 21న ముగిసింది. అనంతరం జరిగిన ఎలక్షన్లలో జనం ఇందిరాగాంధీని చావుదెబ్బ తీయగా, జయప్రకాష్ నారాయణ్ ఆధ్వర్యంలోని జనతాపార్టీని అందలం ఎక్కించారు. మరోవైపు ఇందిరాగాంధీ జీవితంలోనే కాదు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కూడా ఎమర్జన్సీని మచ్చగా, దాచిపెట్టాల్సిన విషయంగా భావిస్తారన్న విషయం తెలిసిందే.