లేడీ ఓరియంటెడ్ సినిమాలు తీయడం అంత ఈజీ కాదంటున్నాడు ప్రముఖ దర్శకనిర్మాత, జాతీయ అవార్డు గ్రహీత మధుర్ భండార్కర్. మహిళా ప్రాధాన్యత చిత్రాలను కలర్‌ఫుల్‌గా మార్చేందుకు లేనిపోని సలహాలు, సూచనలు ఇస్తుంటారని పేర్కొన్నాడు.
హిట్టు కోసం తప్పలేదు
తాజాగా ముంబైలోని ఓ ఈవెంట్‌లో పాల్గొన్న మధుర్ భండార్కర్ మాట్లాడుతూ.. నేను సినిమాలు తీయడం మొదలుపెట్టిన తొలినాళ్లలో కమర్షియల్ చిత్రాలకు మంచి గిరాకీ ఉండేది. నాకేమో అలాంటి చిత్రాలు తీయాలనిపించలేదు. కానీ హిట్టు కోసం ఆ తరహా సినిమాలు చేయక తప్పలేదు. నా కెరీర్‌ను ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసిన మూవీ చాందిని బార్. అప్పటినుంచి నా ఆలోచనలో చాలా మార్పు వచ్చింది.
ఆరు ఐటం సాంగ్స్ పెట్టమని సలహా
ఆ సినిమా కోసం చాలామందిని కలిశాను. అందరూ మంచి సబ్జెక్ట్ అని మెచ్చుకున్నారు, కానీ అందులో కనీసం ఆరు ఐటం సాంగ్స్ పెట్టమని సూచించారు. అందుకు నేను ఒప్పుకోలేదు. కొందరు నిర్మాతలు మాత్రమే ఇలాంటి మహిళా ప్రాధాన్యత సినిమాలను సపోర్ట్ చేసేందుకు ముందుకు వచ్చారు. అలాగే కరీనా కపూర్, టబు, ప్రియాంక చోప్రా.. పారితోషికం తగ్గించుకునైనా సరే నా సినిమాలు చేసేవారు.
నచ్చిందే చేయండి
అంతెందుకు? హీరోలు కూడా కొంత తక్కువ మొత్తమే తీసుకుని ఇలాంటి సినిమాల్లో యాక్ట్ చేసేవారు. నేను దర్శకనిర్మాతలకు చెప్పేదొక్కటే! మహిళా ప్రాధాన్యత సినిమాలు చేయాలనుకున్నప్పుడు ఎంతోమంది ఎన్నో సలహాలు ఇస్తుంటారు. కానీ మీకు నచ్చిందే చేయండి. చాందిని బార్ బాలేదని ఎంతోమంది విమర్శించారు. అయినా సరే ఎన్నో అవార్డు వేదికలకు నామినేట్ అయింది.
ఎవరూ ముందుకు రావట్లేదు
ఈ రోజు లాపతా లేడీస్ మూవీని ఉదాహరణగా తీసుకుంటే ఈ సినిమా గురించి ప్రపంచమే మాట్లాడుకుంటోంది. అయినా ఇప్పటికీ ఇలాంటి సినిమాలకు ఎక్కువ బడ్జెట్ ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావట్లేదు. హీరోయిన్లు కూడా తాము చేసిన లేడీ ఓరియంటెడ్ సినిమాలు సక్సెస్ అవకపోతే తమ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని ఆలోచిస్తున్నారు అని చెప్పుకొచ్చాడు.
హేమ కమిటీపై స్పందన
అలాగే మలయాళ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులను అరికట్టేందుకు ఏర్పడిన హేమ కమిటీ పనితీరుపైనా స్పందించాడు. హేమ కమిటీలో నిందితులుగా పేర్కొన్న పలువురూ శిక్ష అనుభవిస్తున్నారు. అలాగే మీటూ ఉద్యమం సమయంలోనూ చాలామందిపై నిషేధం విధించారు. అంటే ఇండస్ట్రీలో తప్పు చేసినవారిపై చర్యలు తీసుకుంటున్నారు అని మధుర్ భండార్కర్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment