
కథానాయకి మారింది
చిత్ర షూటింగ్ ప్రారంభమై, కొన్ని రోజులు చిత్రీకరణ జరుపుకున్న తరువాత కూడా హీరోయిన్లు మారిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకు కారణాలు చాలానే ఉంటాయి. తాజాగా రాజా రంగుస్కీ చిత్ర విషయంలోనూ అదే జరిగింది. ఇంతకు ముందు బర్మా, జాక్సన్ దురై చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ధరణీధరన్ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం రాజా రంగుస్కీ. ఇందులో మెట్రో చిత్రం ఫేమ్ శిరీష్ కథానాయకుడిగా నటిస్తున్నారు. నాయకిగా ఇరైవి చిత్రం ఫేమ్ పూజా దేవరియాను ఎంపిక చేశారు. చిత్రం ప్రారంభమైంది. ఇలాంటి సమయంలో చిత్ర హీరోయిన్ మారింది. పూజా దేవరియాకు బదులు నటి చాందిని తమిళరసన్ వచ్చి చేరింది. కారణాన్ని దర్శకుడు తెలుపుతూ ‘పూజా దవరియా మంచి నటి.
రాజా రంగుస్కీ చిత్రంలోని నాయకి పాత్రకు తను కరెక్ట్‌గా నప్పారు కూడా. అయితే తను అనూహ్యంగా అనారోగ్యానికి గురవ్వడంతో వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి అవసమైంది. తాము రెండు నెలల్లో చిత్ర షూటింగ్‌ను పూర్తి చేయాల్సిన పరిస్థితి. అందువల్ల ఆమెను చిత్రం నుంచి తప్పించాల్సిన పరిస్థితి అని వివరించారు. చాలా తక్కువ సమయంలో నటి చాందిని తమిళరసన్ ను హీరోయిన్ Sగా ఎంపిక చేశామని, తను చాలా చక్కని నటనను ప్రదర్శిస్తున్నారని దర్శకుడు ధరణీధరన్ తెలిపారు. ఇప్పుడు అనుకున్న విధంగా రాజా రంగుస్కీ చిత్రాన్ని రెండు నెలల్లో పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.