Dil Raju: Producer Speech About Rowdy Boys Goes Viral - Sakshi
Sakshi News home page

Dil Raju: ఆశిష్‌ను హీరో చేయమని నా భార్య అడిగేది

Published Fri, Jan 14 2022 1:09 AM | Last Updated on Fri, Jan 14 2022 10:59 AM

Dil Raju Speech At Rowdy Boys - Sakshi

‘దిల్‌’ రాజు, ఆశిష్‌

ఆశిష్‌ను పెద్ద దర్శకుడితో లాంచ్‌ చేయవచ్చు. ఆశిష్‌ లాంచ్‌కు పెద్ద డైరెక్టర్‌ని పెడదామని శిరీష్‌ కూడా అన్నాడు. కానీ దానికి నేను వ్యతిరేకం. పెద్ద డైరెక్టర్‌ అయితే డబ్బు కోసమో, ఆబ్లిగేషన్‌ కోసమో చేస్తాడు. నాకు ఈ రెండూ ఇష్టం లేవు. ఓ కుర్రాడితో సినిమా చేస్తున్నప్పుడు ఓవర్‌ బడ్జెట్‌ పెట్టాలని నాకు లేదు. ఓ కొత్త యాక్టర్‌లానే ఆశిష్‌ను ఎదగనివ్వాలని అనుకున్నాను’’ అని ప్రముఖ నిర్మాత ‘దిల్‌’ రాజు అన్నారు.

Producer Speech About Rowdy Boys Movie Hero: ‘దిల్‌’ రాజు సోదరుడి కుమారుడు శిరీష్‌ తనయుడు ఆశిష్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘రౌడీబాయ్స్‌’. ‘హుషారు’ ఫేమ్‌ శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ – ‘‘ఇప్పటి స్టార్‌ హీరోలు కొందరు ఒకప్పుడు మా నిర్మాణ సంస్థ నుంచే లాంచ్‌ అయ్యారు. అయితే ఆశిష్‌కు నేను ఎవరితో పోలికలు పెట్టను. ఎవరి బ్రాండ్‌ వారిది. ఇండస్ట్రీలో ప్రస్తుతం 20 మంది హీరోలు ఉన్నారు.

రాబోయే రోజుల్లో ఇంకా వస్తారు.. వస్తూనే ఉంటారు. కానీ ఇందులో ఎంతమంది హీరోలు నిలబడతారు అనేది వారి హార్డ్‌ వర్క్, స్క్రిప్ట్‌ సెలక్షన్‌పై ఆధారపడి ఉంటుంది. అయితే ఆశిష్‌కు స్క్రిప్ట్‌ సెలక్షన్‌ విషయంలో నేను ఉన్నాను కాబట్టి సహాయం చేస్తాను. మూడు నాలుగు సినిమాల తరవాత తనే ఫలానా కథ నచ్చిందని చెప్పేస్తాడు. మంచి కంటెంట్‌కు ఆర్టిస్ట్‌ కష్టం తోడైతేనే ఆడియన్స్‌కు ఆ ఆర్టిస్ట్‌ ఎక్కువగా రీచ్‌ అవుతారని నేను నమ్ముతాను. నా సక్సెస్‌ రీజన్‌ కూడా అదే.

నేను కూడా స్టోరీలను పట్టుకునే ఇప్పుడు నిర్మాతగా ఈ స్థాయికి చేరుకున్నాను. నా కెరీర్‌ స్టార్టింగ్‌లో నా మొదటి తొమ్మిది సినిమాలకు ఏ స్టార్‌ హీరో లేడు. ‘బృందావనం’తో ఎన్టీఆర్‌ రూపంలో ఆ సమయంలో నాకో స్టార్‌ హీరో దొరికారు. అప్పటివరకు నేను అప్‌కమింగ్‌ నిర్మాతగానే కెరీర్‌లో ముందుకు వెళ్లాను. అదే నా ఫిలాసఫీ. ఇప్పుడు ఆశిష్‌ కూడా అలానే ఎదగాలని కోరుకుంటున్నాను. ‘ఆశు డ్యాన్స్‌ బాగా చేస్తున్నాడు... వాడ్ని హీరో చేయండి’ అని నా భార్య అనేవారు. వాడిని అడిగితే, నటనపై ఆసక్తి ఉంది అన్నాడు.

‘ఆసక్తి ఉంటే సరిపోదు. చాలా కష్టపడాలి. మా బ్యాకప్‌ ఒక సినిమా లేదా రెండు సినిమాలకే ఉపయోగపడుతుంది. ఈలోపు నువ్వు నీ ప్రతిభతో ఆడియన్స్, దర్శకులు, రైటర్స్‌కు రీచ్‌ కాలేకపోతే నువ్వే ఇబ్బంది పడతావ్‌’ అని ఆశిష్‌కు చెప్పాను. ఇక ‘రౌడీబాయ్స్‌’ సినిమా టార్గెట్‌ యూత్‌. హర్ష తన లైఫ్‌లోని సంఘటనలతో ఈ సినిమా కథ చెప్పారు... నచ్చింది. ఓకే చేశాను. ఆశిష్‌ నవ్విస్తాడు.. ఏడిపిస్తాడు. డ్యాన్సులు చేస్తాడు. ఇక ‘దిల్‌’ రాజుగారి సినిమాలంటే ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చుతాయనే ఓ బ్రాండ్‌ ఉంది.

కానీ ‘ఏంటి.. ‘దిల్‌’ రాజు ఎప్పుడూ క్లాసులు పీకుతాడు’’ అనుకున్నవారు కూడా ఉన్నారు. నేను కూడా ఒకే ధోరణిలో సినిమాలు చేస్తే ఆగిపోవాల్సి వస్తుంది. జనరేషన్‌ మారుతోంది. నాకు కష్టం అనిపించినా ఎక్కడో దాటాలి. ‘రౌడీబాయ్స్‌’లో ఉన్న ముద్దు సన్నివేశాన్ని ట్రైలర్‌లోనే చూపించి ఆడియన్స్‌ను ప్రిపేర్‌ చేశాం. కథ డిమాండ్‌ చేయడంతో కొన్ని ముద్దు సన్నివేశాలు పెట్టడం జరిగింది. ఓటీటీ వచ్చాక చాలా మార్పులు వచ్చాయి. నేనూ కథల్ని బట్టి మారుతూ ఉండాలి. ఈ మార్పులో నా ఫస్ట్‌ స్టెప్‌ ‘రౌడీబాయ్స్‌’ సినిమా’’ అన్నారు.

అంతా పాజిటివ్‌...
ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిగారితో గురువారం చిరంజీవిగారు సమావేశమయ్యారు. ఈ సమావేశంపై నాకు పూర్తి అవగాహన లేదు. అయితే అంతకుముందు మేం చిరంజీవిగారితో మాట్లాడాం. ఇండస్ట్రీ సమస్యలపై ఆయనకు ఓ అవగాహన ఉంది. చిరంజీవిగారు వెళ్లారు కాబట్టి ప్రస్తుతం ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్ముతున్నాను. త్వరలో అంతా పాజిటివ్‌గా జరుగుతుంది. సహనంగా ఉండకుండా కొందరు ఏదో మాట్లాడుతున్నారు. దానివల్ల సమస్యలు జటిలం అవుతున్నాయే కానీ పరిష్కారం కావడం లేదు.



పాతిక కిలోల బరువు తగ్గాను – ఆశిష్‌
‘‘ఫ్యామిలీ ఫంక్షన్స్, పార్టీల్లో నేను డ్యాన్స్‌ చేసేవాడిని. డ్యాన్స్‌లో అల్లు అర్జున్‌గారు నా ఫేవరెట్‌. నేను హీరో అవ్వాలనుకుంటున్న విషయాన్ని ఇంట్లో వారికి ప్రూవ్‌ చేసిన తర్వాత నా జర్నీ స్టార్ట్‌ చేశాను’’ అన్నారు ఆశిష్‌. ఇంకా మాట్లాడుతూ – ‘‘అరుణ భిక్షు, సత్యానంద్‌గార్ల దగ్గర, బాంబేలో నటనలో శిక్షణ తీసుకున్నాను. అయితే అనుభవం కోసం ‘కేరింత’కు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశాను. ‘రౌడీ బాయ్స్‌’ షూటింగ్‌ ముందు రోజే సీన్‌ పేపర్స్‌ తీసుకుని ప్రిపేర్‌ అయ్యేవాడిని.

రొమాంటిక్‌ సీన్స్‌ కాస్త ఇబ్బందిగా అనిపించాయి. నాకు రొమాంటిక్‌ అండ్‌ కాలేజ్‌ స్టోరీలంటే ఇష్టం. ఆడియన్స్‌ ఎలా యాక్సెప్ట్‌ చేస్తే అలా వెళ్తాను. హీరోగా మారడానికి 25 కేజీల బరువు తగ్గాను. ఈ సినిమా కెమెరామేన్‌ మదిగారు చెప్పిన నా లోపాలను సరిదిద్దుకుంటూ యాక్టర్‌గా మెరుగుపడ్డాను. నా తర్వాతి చిత్రం కాశీ దర్శకత్వంలో  ‘సెల్ఫిష్‌’ టైటిల్‌తో చేస్తున్నాను’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement