ప్రముఖ సినీ పాటల రచయిత చంద్రబోస్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి మదనమ్మ సోమవారం గుండెపోటుతో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వరంగల్ జిల్లా చిట్యాల మండలం చల్లగిరికి చెందిన చంద్రబోస్ తండ్రి నర్సయ్య ఉపాధ్యాయుడు కాగా తల్లి మదనమ్మ గృహణి. వీరికి నలుగురు కుమారులు. అందరిలో చిన్నవాడు చంద్రబోస్. గతంలో ఓ సారి తన తల్లి గురించి చంద్రబోస్ మాట్లాడుతూ– ‘‘చిన్నప్పుడు తల్లితో కలిసి మా గ్రామంలో ప్రదర్శించే ఒగ్గు కథలు, చిందు భాగవతాలు, నాటకాలు చూసేవాణ్ణి. వాటి వల్లే పద్యాలు, పాటలపై ఆసక్తి పెరిగింది. నేను పాటల రచయిత కావడం వెనక అమ్మ స్ఫూర్తి ఎంతో ఉంది’’ అన్నారు. కాగా చల్లగిరిలో మదనమ్మ అంత్యక్రియలు నిర్వహించారు. ‘‘పెదవే పలికిన మాటల్లోనే తియ్యని మాటే అమ్మ... కదిలే దేవత అమ్మ.. కంటికి వెలుగమ్మ’ అంటూ ‘నాని’ సినిమాలో తల్లి గురించి చంద్రబోస్ ఓ అద్భుతమైన పాట రాశారు. ఆ పాట అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఎవర్‌గ్రీన్.
Comments
Please login to add a commentAdd a comment