చిరు త్యాగం!
పాత్ర కోసం ఏం చేయడానికైనా వెనకాడని నటీనటులు కొంతమంది ఉంటారు. రామ్‌చరణ్ అలాంటి నటుడే. క్యారెక్టర్ డిమాండ్‌ని బట్టి ఫిజిక్‌ని మార్చేసుకుంటారు. ప్రస్తుతం చేస్తున్న ‘ధ్రువ’ సినిమా కోసం గుర్రపు స్వారీ చేస్తూ, ఫైట్ చేయడం నేర్చుకున్నారు రామ్‌చరణ్. ఇప్పుడు ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం శాకాహారిగా మారిపోయారు. ‘‘ఈ సినిమా కోసం వెజ్జీగా మారుతున్నాను. ఈ పాత్రకు ఇలా మారడం కరెక్ట్ అని నమ్ముతున్నా’’ అని పేర్కొనడంతో పాటు కూరగాయలతో తయారు చేసిన ఓ డిష్‌ని ఆస్వాదిస్తూ, రామ్‌చరణ్ ఫొటో పోస్ట్ చేశారు.
వాస్తవానికి మాంసాహారానికి అలవాటు పడినవాళ్లకు వారానికోసారైనా అది తినకపోతే శాకాహారం పెద్దగా మింగుడుపడదు. కానీ, పాత్ర కోసం చరణ్ కొన్నాళ్ల పాటు తన జిహ్వ చాపల్యాన్ని అదుపులో పెట్టుకోనున్నారు. దీన్నిబట్టి సినిమా కోసం చరణ్ చిన్న చిన్న త్యాగాలు చేయడానికి ఇష్టంగా రెడీ అయిపోతారని ఊహించవచ్చు. అఫ్‌కోర్స్ పెద్ద త్యాగాలకూ వెనకాడరనుకోండి.