
హీరోపై లైంగిక దాడి కేసు
హాలీవుడ్ నటుడు చార్లీ షీన్పై లైంగిక దాడి కేసు నమోదైంది. అతడు తనను కావాలని భావపరమైన ఒత్తిడికి గురిచేశాడని చార్లీ డెంటల్ టెక్నీషియన్ మార్గరిటా పాలెస్టినో ఫిర్యాదు చేశారు. అతడు తన డెంటల్ ఛైర్ నుంచి ఒక్కసారిగా గెంతి, నైట్రస్ ఆక్సైడ్ మాస్క్ తీసేసి, తనను గట్టిగా పట్టుకున్నాడని ఆమె ఫిర్యాదుచేసింది. ఈ సంఘటన సెప్టెంబర్ 25వ తేదీన జరిగింది. లాస్ ఏంజెలిస్ కౌంటీ సుపీరియర్ కోర్టులో పాలెస్టినో న్యాయవాదులు ఈ ఫిర్యాదు చేశారు.
49 ఏళ్ల చార్లీ షీన్ దంత వైద్యం చేయించుకుంటుండగా, నైట్రస్ ఆక్సైడ్ మాస్క్ వేసిన కొద్దిసేపటికే ఉన్నట్టుండి ఒక్కసారిగా లేచి, ''నేను నిన్ను ...... చంపేస్తాను'' అని అసభ్యకరంగా అన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన దుస్తులు విప్పేసేందుకు కూడా షీన్ తీవ్రంగా ప్రయత్నించాడని ఆమె ఆరోపించారు. ఇటీవలి కాలంలో షీన్ బాగా ఎక్కువగా కొకైన్ వాడుతున్నట్లు ఇతర డెంటిస్టులు తనకు చెప్పారన్నారు. ఇంతకుముందు మరో డెంటిస్టును అతడు కత్తితో బెదిరించి, డెంటల్ ఛైర్ను కూడా కత్తితో పొడిచాడన్నారు. అయితే, ఆమె ఒక సెలబ్రిటీతో తనకు దొరికిన పావుగంట సమయాన్ని వాడుకోడానికి ఇలా అసత్య ఆరోపణలు చేస్తున్నారని షీన్ న్యాయవాది మార్టీ సింగర్ అన్నారు.