‘‘ఒక చిన్న సినిమా విడుదలకి ముందే అన్ని పాటలు శ్రోతలను ఆకట్టుకోవడం నిజంగా అదృష్టం. శివ పరిచయం కాబోతున్న సినిమా అంటే మా అందరికీ సెలబ్రేషన్ మూమెంట్’’ అన్నారు దర్శక–నిర్మాత మధుర శ్రీధర్. ‘పెళ్లి చూపులు, మెంటల్ మదిలో’ చిత్రాలను నిర్మించిన రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘చూసీ చూడంగానే’. శేష సింధు దర్శకత్వంలో రాజ్ కందుకూరి నిర్మించిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, మాళవిక కథానాయికలు.
సురేశ్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ నెల 31న ఈ చిత్రం విడుదల కానుంది. విడుదలైన పాటలకు 25 మిలియన్ల వ్యూస్ రావడంతో ప్లాటినం డిస్క్ ఫంక్షన్ నిర్వహించింది చిత్రబృందం. రాజ్ కందుకూరి మాట్లాడుతూ – ‘‘టీజర్, ట్రైలర్స్‌కి మంచి స్పందన వచ్చింది. పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సంగీత దర్శకుడు, రచయితలందరికీ ధన్యవాదాలు. సినిమా బాగా వచ్చింది’’ అన్నారు. ‘‘ఈ సినిమా పెద్ద హిట్ అయి 2020 మా శివదే కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ‘మధుర’ శ్రీధర్.
‘‘సినిమా మొదలయినప్పటి నుంచి అన్నీ సక్రమంగానే జరుగుతున్నాయి. నా సినిమాలో పాటలన్నీ బావుండాలని పెద్ద రచయితలతోనే రాయించుకున్నాం. శివ బాగా యాక్ట్ చేశాడు’’ అన్నారు శేష సింధు. ‘‘మంచి స్క్రిప్ట్‌తో నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న మా నాన్నగారికి, మా డైరెక్టర్ సింధుగారికి ధన్యవాదాలు’’ అన్నారు శివ కందుకూరి. ‘‘సున్నితమైన భావోద్వేగాలతో శేష సింధుగారు బాగా చిత్రీకరించారు. సినిమాకు మంచి సంగీతం కుదిరింది’’ అన్నారు రచయిత అనంత శ్రీరామ్.
Comments
Please login to add a commentAdd a comment