ఆదితో కలసి నటించడం కిక్ ఇచ్చింది
- సాయికుమార్
‘‘ఇప్పటి తరంలో ప్రతిభ చాలా ఉంది. కానీ, వారికి ప్రోత్సాహం లభించడం లేదు. కొత్త తరాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత దర్శక-నిర్మాతలపై ఉంది. పీజే శర్మ కుటుంబం ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చింది. మంచి హీరోకి కావాల్సిన లక్షణాలన్నీ ఆదిలో ఉన్నాయి’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. ఆది, నమితాప్రమోద్ జంటగా శ్రీ ఐశ్వర్య లక్ష్మి మూవీస్, ఎస్.ఆర్.టి మూవీ హౌస్ పతాకంపై వీరభద్రమ్ దర్శకత్వంలో వెంకట్ తలారి, రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న చిత్రం ‘చుట్టాలబ్బాయి’.
ఎస్‌ఎస్ తమన్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని తలసాని విడుదల చేసి దర్శకుడు కొరటాల శివకు అందించారు. హీరో సుధీర్‌బాబు ట్రైలర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ - ‘‘తెలంగాణ ప్రభుత్వం చిన్న చిత్రాల కోసం ఐదో ఆటకు వెసులుబాటు కల్పిస్తోంది. డెరైక్టర్ కొరటాల శివ పెద్ద హీరోలతో పాటు చిన్న హీరోలను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ‘చుట్టాలబ్బాయి’ విజయవంతమై చిత్ర బృందానికి మంచి పేరు తీసుకురావాలి’’ అన్నారు. వీరభద్రమ్ మాట్లాడుతూ- ‘‘ఆది, సాయికుమార్‌గారు మొదటిసారి కలిసి నటించిన చిత్రమిది. ఈ చిత్రంతో మా నిర్మాతలకు ‘చుట్టాలబ్బాయి’ అనేది ఇంటి పేరుగా మారిపోతుంది. అంత బాగా నిర్మించారు’’ అన్నారు.‘‘మేం ఈ చిత్రం నిర్మించామంటే కారణం వీరభద్రమ్. తను పని రాక్షసుడు. ఈ సినిమా బాగా తీశాడు’’ అని నిర్మాతలు తెలిపారు. సాయికుమార్ మాట్లాడుతూ- ‘‘నేను, మా అబ్బాయి ఆది కలిసి ఓ చిత్రం చేయాలనుకుంటున్న సమయంలో ఈ చిత్రం కుదిరింది. ఆదితో కలిసి నటించడం నాకు కిక్ ఇచ్చింది. కుటుంబ సమేతంగా చూసేలా వీరభద్రమ్ ఈ చిత్రం తెరకెక్కించారు’’ అని పేర్కొన్నారు.
ఈ వేడుకలో ఆది, నమితా ప్రమోద్, ఎస్‌ఎస్ తమన్, హీరోలు సందీప్ కిషన్, రాజ్ తరుణ్, నిర్మాతలు కేకే రాధామోహన్, మల్కాపురం శివకుమార్, శ్రీమతి జీవితా రాజశేఖర్, దర్శకుడు అనిల్ రావిపూడి, రచయితలు కోన వెంకట్, బీవీఎస్ రవి, పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.