సినిమా ఒక మత్తు మందు లాంటింది:దియా మీర్జా
న్యూఢిల్లీ: సినిమాలు తీయడం మత్తుమందు వంటిది. ఒకసారి ఇందులోకి దూకామంటే బయటికి రావడం కష్టమని బాబీ జసూస్ సినిమా నిర్మాత దియామీర్జా తెలిపింది. త్వరలో విడుదలయ్యే ఈ చిత్రం పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తుందని ఈ చిత్ర నిర్మాత, హైదరాబాదీ బ్యూటీ మీర్జా హామీ ఇస్తోంది. సాధారణంగా మహిళల ఆధారిత సినిమాల్లో హాస్యం తక్కువగా ఉంటుందని, ఇప్పుడు వినోదాత్మక సినిమాలు కూడా వస్తున్నాయని చెప్పింది. ‘మన సినిమాల్లో హీరోయిన్లకు ప్రాధాన్యం ఉంటుంది కానీ కథలో వాళ్ల ప్రమేయం తక్కువ. గ్లామర్‌పైనే ఎక్కువగా ఆధారపడుతారు. మా బాబీ జసూస్ గూఢచారి సినిమా. ఎప్పుడూ పురుషులే నటించే డిటెక్టివ్ పాత్ర ఇందులో విద్యాబాలన్ చేసింది’ అని దియా వివరించింది. ఈ సినిమాలో గడ్డం, చింపిరి జట్టుతో మగ బిచ్చగాడిలా విద్యాబాలన్ కనిపిస్తున్న ప్రచారం ఫొటోలు గతవారం విడుదలై చాలా మంది దృష్టిని ఆకర్షించాయి. ఇక సినిమా విజయంపై దియా ఎంతో ధీమాగా ఉంది.
ఇది పురుషులతోపాటు మహిళలనూ ఆకట్టుకుంటుందని, కుటుంబ సభ్యులంతా కలిసి చూడవచ్చని నమ్మకంగా చెబుతోంది. సమర్ షేక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా దియాకు చెందిన బార్న్ ఫ్రీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. నిర్మాతను అయిన తరువాత నటనకు కొంచెం దూరం కావడం బాధగానే అనిపిస్తోంది. సినిమాను నిర్మించడమనేది చాలా పెద్ద బాధ్యత’ అని ఈ 32 ఏళ్ల బ్యూటీ చెప్పింది. ఢిల్లీలో శుక్రవారం రాత్రి జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ప్రముఖ డిజైనర్ అనితా డోంగ్రే వస్త్రాలతో దియా వేదికపై మెరిసింది.