సూయ.. పాట అనసూయ కోసమే అనుకున్నా
‘విన్నర్’ సినిమా కోసం పాట పాడమని సంగీత దర్శకుడు తమన్ అడిగిప్పుడు తమాషా చేస్తున్నాడనుకున్నా. అయితే తను సీరియస్‌గానే అని చెప్పడంతో చెన్నై వెళ్లి పాట పాడా’’ అని యాంకర్ సుమ చెప్పారు. సాయిధరమ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బేబి భవ్య సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు నిర్మించిన చిత్రం ‘విన్నర్’. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ 24న సినిమా రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో ‘సూయ సూయ’ పాట పాడిన సుమ, ఆ పాటలో నర్తించిన యాంకర్ అనసూయ తమ అనుభూతులు పంచుకున్నారు.
సుమ మాట్లాడుతూ– ‘‘తమన్ ఇచ్చిన లిరిక్స్‌లో ‘సూయ సూయ’ పల్లవి చదవగానే ఇది అనసూయ కోసం రాసిన పాట కదా? అని అడగడంతో అవునన్నాడు. తర్వాత అనసూయకు ఫోన్ చేసి నేను పాట పాడా, అది నువ్వు డ్యాన్స్ చేసే పాట అనగానే థ్రిల్ అయ్యింది. బాగా పాడానని ఎస్పీబీగారు ప్రశంసించడం మరచిపోలేను’’ అన్నారు. ‘‘ప్రేక్షకులు నన్ను ‘క్షణం’ చిత్రం అనసూయగానే గుర్తు పెట్టుకో వాలని, ఆ తర్వాత ఏ సినిమా చేయలేదు. ‘విన్నర్’లో పాట చేయమనడంతో భయపడి వద్దన్నా. కానీ, ఆ పాటలో కొన్ని లిరిక్స్ వినగానే చేయాలనిపించి చేశా’’ అన్నారు అనసూయ.