కరోనా భయాందోళనలతో పలు దేశాలు లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్ విధించడంతో ఎక్కడున్నా వారు అక్కడికే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా నిలిచిపోవడంతో.. విదేశాల్లో ఉన్నవారు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే హీరో మంచు విష్ణు భార్య విరానిక, పిల్లలు అరియానా, వివియానా, అవ్రమ్, ఐరావిద్య విదేశాల్లో ఉండిపోవాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించి మంచు విష్ణు మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేశారు. విరానికను, పిల్లలను చాలా మిస్సవుతున్నానని, చాలా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తనలాగే చాలా మంది బాధ అనుభవిస్తూ ఉండొచ్చు.. కానీ లాక్‌డౌన్ అనేది చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు లాక్‌డౌన్ పాటించి.. కరోనాను ఆరికట్టేందుకు మద్దతుగా నిలవాలని కోరారు. కాగా, ఆ వీడియోలో మాట్లాడుతున్న సమయంలో విష్ణు కళ్లలో నీళ్లు తిరగడం చూస్తే.. ఆయన ఎంత బాధ పడుతున్నారో అర్థమవుతుంది.
‘నేను ఎందుకు గడ్డం పెంచుతున్నానని చాలా మంది అడుగుతున్నారు. అది కొంతమందికి నచ్చుతుంది.. ఇంకొందరికి నచ్చడం లేదు. ఎందుకు పెంచుతున్నానంటే ఓ కారణం వల్ల పెంచుతున్నాను. నా భార్య, పిల్లలు వేరే ఊరిలో ఉన్నారు. వాళ్లు ఇక్కడికి వచ్చిన తర్వాత గడ్డం తీస్తాను. ఫిబ్రవరి చివరి వారంలో మా ఫ్యామిలీ మెంబర్‌కు ఆరోగ్యం బాగోలేక సర్జరీ కోసం వేరే దేశానికి వెళ్లాం. అందరం వెళ్లాం. దేవుడి దయ వల్ల సర్జరీ బాగా జరిగింది. అయితే మార్చి 19న నాన్నగారి పుట్టినరోజు, విద్యానికేతన్‌లో వార్షికోత్సవం ఉండటంతో.. మార్చి 11న నేను, నాన్న, అమ్మ ఇక్కడికి వచ్చేశాం. పిల్లలు, విరానిక ఇంకో నాలుగైదు రోజుల్లో వచ్చేయాలి. అయితే మేము వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోవడంతో విద్యానికేతన వార్షికోత్సవం క్యాన్సల్ చేశాం. వాళ్లు ఉన్న దేశంలో కూడా సందర్శకులను అనుమతించకుండా ఆపేశారు. దాని తర్వాత మన దగ్గర కూడా అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిపివేశారు.
ఏప్రిల్ 14న ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అనుమతిస్తారని అనుకుంటున్నాను. గత ఏడేళ్లుగా అరి, వివి పుట్టాకా.. నేను వేరే ఊరికి పనిమీద వెళ్లిన సాయంత్రానికి వచ్చేవాడిని.. ఎందుకంటే పిల్లలతో గడపాలని. వాళ్లతో నాకు అటాచ్‌మెంట్ చాలా ఎక్కువ. అందుకే ఇప్పుడు బాగా కష్టంగా ఉంది. మేము అంతా ఒకే దగ్గర క్వారంటైన్‌లో ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఫోన్‌లో మాట్లాడుతున్నప్పటికీ.. చాలా బాధగా ఉంది. వాళ్లను చాలా మిస్సవుతున్నాను. నాలాగే చాలా మంది ఈ రకమైన బాధ అనుభవిస్తూ ఉండొచ్చు.. కానీ లాక్‌డౌన్ అనేది చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరు దీనిని పాటించాలి. ప్రతి ఒక్కరు లాక్‌డౌన్‌కు మద్దతుగా నిలవాలి. ధైర్యంగా ఉండండి’ అని విష్ణు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment